
మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం మేరకు.. నర్సాపూర్ పట్టణంలోని చైతన్య పూరి కాలనీకి చెందిన మల్లెపూల వెంకటేశ్ మద్యానికి బానిసై తరచూ భార్య సంతోష, ఇతర కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించి మళ్లీ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. సోమవారం తెల్లవారు జామున ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో మహిళ
చిన్నశంకరంపేట(మెదక్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం వల్లూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. వల్లూర్‌కు చెందిన డోడ్లె సురేశ్‌కు వెల్దుర్తి మండ లం బండపోసాన్‌పల్లి గ్రామానికి మౌనిక(30)తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మౌనిక స్థానికంగా ఉన్న పరిశ్రమలో పనికి వెళ్తుండగా సురేశ్ వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేస్తుంటాడు. కొద్ది రోజులు గా పరిశ్రమలో పనికి వెళ్లొద్దని దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం పరిశ్రమలో పనికి వెళ్లొద్దని సురేశ్ భార్యకు చెప్పి ఉపాధి పనికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పనులు ముగించుకొని ఇంటికొచ్చిన భర్త చూసి పోలీస్‌లకు సమాచారం ఇచ్చాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక మృతిపై తల్లి శేఖమ్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.