
సన్నాల సాగుకే సై
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
● వానాకాలంలో మరింత రెట్టింపు ● రెండేళ్లుగా స్పష్టంగా పెరుగుదల ● బోనస్ పథకంతో రైతులకు మేలు ● సన్న బియ్యం పంపిణీతో మరింత ధీమా
పెరిగిన సన్నాల వాడకం..
ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా సన్న బియ్యం వాడకం విపరీతంగా పెరిగింది. పదేళ్ల కిందట వరకు రైతులు, గ్రామీణ స్థాయిల్లో దొడ్డు బియ్యం వాడకం కొనసాగేది. రైతులు తమ కమతాల్లో సాగైన బియ్యం తినేందుకే ఇష్టపడేవారు. కానీ కాలంతోపాటు సన్నాల కొనుగోళ్లు పెరగడంతో గ్రామీణ స్థాయిలో మధ్యతరగతి వర్గాల వరకు సన్న బియ్యంను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యం కూడా జనాలు అమ్మేసి సన్న బియ్యం కొనుగోలు చేస్తుండడంతో దీన్ని నివారించేందుకు ప్రభుత్వమే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెలలో పంపిణీ జరిగిన సన్న బియ్యంను జనాలు తినేందుకు ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో సన్నాల వినియోగమే అధికంగా మారనుండటంతో రైతులు కూడా అందుకు అనుగుణంగా సన్నాల వైపు మళ్లుతున్నారు.
అన్నదాతలు సన్నాల సాగుకు సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డు రకాలకు, సన్నరకాలకు ఒకే కనీస మద్దతు ధర ఉండటంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు బోనస్ పథకం అమలులోకి రావడంతో సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం కూడా ప్రారంభించడంతో రైతులకు మరింత ధీమా వచ్చింది. రానున్న వానాకాలంలో వరి సాగులో 70 శాతం వరకు సన్నాలే సాగవుతాయని, సన్నరకాల విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది.
– నారాయణఖేడ్
2023–24 యాసంగిలో జిల్లాలో సన్నాలను 2,312 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 2024– 25 యాసంగిలో సాగు విస్తీర్ణం 3,640కి పెరిగింది. 2024–25 వానాకాలం వచ్చేసరికి 5,474 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. రానున్న వానాకాలం 2025–26కు గాను గత వానాకాలం కంటే రెట్టింపుగా 10,948 ఎకరాలకు సన్నాల సాగు చేరవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విస్తీర్ణం కంటే అధికంగా పెరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంటున్నారు. గతంలో సన్నాల సాగు చూద్దామంటే కనిపించని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం రైతులు మారుతున్న కాలంతోపాటు మార్పు దిశగా పయణిస్తూ సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
బోనస్‌తో మేలు..
ప్రభుత్వం బోనస్ పథకం ప్రవేశపెట్టడంతో రైతులు సన్నాల సాగును పెంచేందుకు దోహదం అవుతుంది. కనీస మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఉండగా దానికి రూ.500 కలపడంతో రూ.2,800కు చేరింది. దీంతో బహిరంగ మార్కెట్లో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గత వానాకాలంలో జై శ్రీరాం లాంటి పలు రకాల సన్నాలకు మంచి డిమాండ్ పలికింది. జిల్లాలో డెల్టా, కావేరి, కోనవరం సన్నాలు, జగిత్యాల సన్నాలు, తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్ 15048) తదితర రకాలను సాగు చేస్తుంటారు. వ్యవసాయశాఖ 34 రకాల సన్నాలను గుర్తించింది. ముఖ్యంగా నల్గొండ లాంటి ప్రాంతాల్లో భారీ మిల్లులు ఉండటంతో అక్కడ మాశ్చర్ (తేమశాతం) 25 వచ్చినా కొనుగోలు చేస్తుండడం, జిల్లాలో 17 మాశ్చర్ (తేమశాతం) కావాలనడంతో రైతులకు కొంత నష్టదాయకమే. మాశ్చర్ విషయంలో మినహాయింపులు ఉండాలని రైతులు కోరుతున్నారు.
సన్నాలకు ‘చీడ’ సమస్య!
సన్నాల విస్తీర్ణం పెరుగుతోంది
సన్నాల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. మూడేళ్ల కాలంతో పరిశీలిస్తే పెరుగుదల స్పష్టంగా కన్పిస్తుంది. ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడం, పౌర సరఫరాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం, ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యవసాయ అధికారుల ప్రచారం వల్ల సన్నాల సాగు పెరిగింది. చీడ పీడల సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సలహాలు, సూచనలు పొందాలి. మంచి దిగుబడులు సాధించవచ్చు.
– నూతన్‌కుమార్, ఏడీఏ, నారాయణఖేడ్
దొడ్డు రకం వరి ధాన్యంతో పోలిస్తే సన్న రకం వరి ధాన్యానికి చీడ పీడల సమస్య కాస్త అధికంగా ఉండనుంది. సన్నాలు, దొడ్డురకం రెండు పంటలూ 120 రోజుల కాలంలోనే కోతకు వస్తుంటాయి. సన్నాలకు మార్కెట్‌లో బోనస్‌తో కలిపితే ధర అధికంగా ఉంటుంది. అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు, ఆకుచుట్ట పురుగు తదితర తెగుళ్లు సోకే అవకాశాలు సన్నాలకు అధికంగా ఉంటాయి.

సన్నాల సాగుకే సై