
అంగన్‌వాడీకి కొత్త భవనం
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
కంది(సంగారెడ్డి): కంది మండల పరిధిలోని మామిడిపల్లిలో శిథిలావస్థకు చేరిన అంగన్‌వాడీ భవనాన్ని కూల్చివేసి అదేస్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలోని అంగన్‌వాడీ భవనాన్ని బుధవారం చంద్రశేఖర్ పరిశీలించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, సీడీపీవో జయరాం నాయక్, పంచాయతీ కార్య దర్శి శ్రీధర్ స్వామి, అంగన్‌వాడీ టీచర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
332 సెల్‌ఫోన్లు రికవరీ
ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ఫోన్ల రికవరీ కోసం ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణలో బుధవారం మొబైల్ రికవరీ మేళాను నిర్వహించి పోగొట్టుకున్న, చోరీకి గురైన 332 మంది మొబైల్ ఫోన్ బాధితులకు సెల్‌ఫోన్లను అధికారులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, బాధితులకు అందించామన్నారు. తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడిన, ప్రమోట్ చేసినా అలాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు,సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగం పాల్గొన్నారు.
ధర్నా విజయవంతం చేయాలి
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఎస్‌జీటీ ఉపాధ్యాయ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య బుధవారం విలేకరులతో మాట్లాడుతూ...ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు. కులగణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అమృత్, సంఘం నాయకులు యూనస్, శివకుమార్, విశ్వనాథ్ రాథోడ్, కిషన్ బానోత్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కుస్తీపోటీలు
నారాయణఖేడ్: శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని నారాయణఖేడ్‌లో బుధవారం నిర్వహించిన కుస్తీపోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కుస్తీపోటీలు నిర్వహించారు. ఖేడ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో తలపడ్డారు. ఉత్సవాల చివరోజు ఉదయం రాములోరిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఉమ్మడి జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్, మాజీ ఆలయ చైర్మన్ ముత్యం హన్మాండ్లు, వివేకానంద్, పాండు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీకి కొత్త భవనం

అంగన్‌వాడీకి కొత్త భవనం