
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పెద్ద చెరువుకు, కూడవెల్లి వాగుకు అనుసంధానంగా ఉన్న నాగయ్య వాగుపై ఏర్పాటు చేసే బ్రిడ్జి నిర్మాణం కోసం గురువారం భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ప్రాంతానికి తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు అక్బర్‌పేట–భూంపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సిద్దిపేట–మెదక్ జాతీయ రహదారి ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులను ఢిల్లీ వరకు తీసుకెళ్లి వారికి నష్ట పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతీ మండలానికి రోడ్డు డివైడర్లు, ప్రతీ గ్రామానికి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెదక్ ఎంపీగా గెలుపొందిన 10 నెలల కాలంలో రూ. 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులు ఇప్పించానన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రతీ గ్రామానికి సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామం నుంచి దుబ్బాక మండలం హబ్షీపూర్ వరకు నిర్మించే రోడ్డుకు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎల్ముల దేవరాజు, మద్దెల రోశయ్య, టెలికాం బోర్డు మెంబర్ మల్లేశం, మండల అధ్యక్షుడు జిగిరి అమర్ తదితరులు పాల్గొన్నారు.