
దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: స్వయం ఉపాధి కల్పించే వివిధ కోర్సులకు హుస్నాబాద్ పట్టణంలోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని సెట్విన్ శిక్షణ కేంద్ర జిల్లా కో ఆర్డినేటర్ అమీనా భాను కోరారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మొగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, మెహందీ, బ్యూటీషన్, కంప్యూటర్ ఎలక్ట్రీషి యన్ తదితర కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కోర్సుల పై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
పిడుగుపాటుతో ఆవు మృతి
చేర్యాల(సిద్దిపేట): పిడుగుపాటుతో ఆవు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేసిరెడ్డి సురేందర్‌రెడ్డి రోజువారి పనులు ముగించుకొని బుధవారం రాత్రి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసి వెళ్లాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా పిడుగు పడి ఆవు మృతి చెంది ఉంది. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఏడుగురికి గాయాలు
అల్లాదుర్గం(మెదక్): రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు అయ్యా యి. ఈ ఘటన అల్లాదుర్గం మండలం 161 రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్ వైపు నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్తున్న కారు అల్లాదుర్గం సబ్ స్టేషన్ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా అంబులెన్సులో జోగి పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో హైదరాబాద్ నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్తున్న బూలోరా వాహనం కాయిదంపల్లి శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతో
ఉరేసుకొని ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హవేళిఘణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఔరంగాబాద్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ కథనం మేరకు.. ఔరంగాబాద్ గ్రామానికి చెందిన ఆడెపు ధన్‌రాజ్(32) ఇంట్లో కొంత కాలంగా కుటుంబ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన ధన్‌రాజ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిషేధిత మాదకద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం నిషేధిత మాదకద్రవ్యాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ పవన సంధ్య పీపీటీ ద్వారా మాదకద్రవ్యాలు వాటి రకాలు, అందులో ఉపయోగకరమైనవి, హానికరమైనవి వివరించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ మెంబర్ బాలకిషన్ మాట్లాడుతూ.. నేటి యువత మాదకద్రవ్యాలకు ఏ విధంగా ఆకర్షితులై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారో వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్య రెడ్డి, ఐక్యూ ఏసీ కో ఆర్డినేటర్ మధుసూదన్, సీఓఈ గోపాల సుదర్శనం, ఆంటీ డ్రగ్ కమిటీ కన్వీనర్ బాలకిషన్, కృష్ణయ్య, శ్రద్ధానందం, విశ్వనాథం, రాణి, పుణ్యమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
పోలీసుల అదుపులో ఇద్దరు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. బెల్ టౌన్‌షిప్‌లోని స్టేడియం వద్ద కొందరు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అడుతున్నారని ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. పటాన్‌చెరుకు చెందిన కృష్ణ, చిరంజీవి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్‌లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. చిరంజీవి అనే వ్యక్తి బెట్టింగ్ కట్టిన వారి నుంచి నగదు తీసుకొని రంజిత్‌కు అందజేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణ, చిరంజీవి నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయగా, అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం