
మామిడి రైతులను ఆదుకోవాలి
కొండాపూర్(సంగారెడ్డి): వడగళ్ల వానతో నష్టపోయిన మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లిలో మామిడి తోటలను సందర్శించి, రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ...గాలితోపాటు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి తోటలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మామిడి రైతులు వీరన్న, మల్లేశం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.