
డంపింగ్ యార్డ్ వద్దు
ప్రజాభిప్రాయంలో తేల్చిచెప్పిన గ్రామస్తులు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని నల్లపల్లి సమీపంలో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు 66వ రోజు చేరుకున్నాయి. జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక ఎమ్మార్వో పరమేశంకు నోటీసుకు నల్లవల్లి, కొత్తపల్లి, లక్ష్మాపూర్, ప్యారానగర్ వాసులు స్పందించారు. భారీ సంఖ్యలో హాజరైన నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాదాపు 1,200 అర్జీలు డంపింగ్‌యార్డ్‌కు వ్యతిరేకంగా వచ్చినట్లు తహసీల్దార్ పరమేశం వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఆర్డీవో ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం
తహసీల్దార్ కార్యాలయానికి డంపింగ్‌యార్డు వద్దని అర్జీలు పెట్టేందుకు వచ్చిన నల్లవల్లి గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యంతరాలు తెలిపేందుకు వచ్చిన గ్రామస్తులపై పోలీసు చర్యను స్థానికులు తీవ్రంగా ఖండించారు.