
దంపతుల మధ్య గొడవవాటర్ ట్యాంక్‌పై నుంచి దూకిన భర్త
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. క్షణికావేశంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మల్లుపల్లిలో శనివారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాలమాకుల కనకయ్య (38) సరిత దంపతులు. వీరికి 18 ఏళ్లలోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కనకయ్య వ్యవసాయ కూలీ పనులతో పాటు, హమాలీ పనులు చేస్తుంటాడు. కొద్ది కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం డబుల్ బెడ్‌రూంల సమీపంలో భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. సరిత దంపతులు కలుగజేసుకొని కనకయ్యను తిట్టడంతో అవమానంగా భావించి క్షణికావేశంలో పక్కనే ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌పై ఎక్కాడు. గమనించిన స్థానికులు కిందికి దిగి రావాలని వారించినా వినకుండా ఒక్కసారిగా దూకే శాడు. మొదట ట్యాంక్ సమీపంలోని కరెంటు తీగలపై పడ్డాడు. విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలై అక్కడి నుంచి మళ్లీ కిందపడ్డాడు. స్థానికులు వెంటనే సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బోయిని పరుశరామ్ తెలిపారు.