సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా 194 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా అందులో 108 వాటిని పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్ చేశారు. 3 వేల నుంచి 5వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యాయి. ఆరోగ్య ఉపకేంద్రాలలో గతంలో వ్యాధి నిర్ధారణ చేయలేని పరిస్థితి ఉండేది. జ్వరం, జలుబు, తలనొప్పి, విరేచనాలు వంటి చిన్న సమస్యలకే మందులు ఇచ్చేవారు. ఉపకేంద్రం పరిధిలోని వారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడితే సమీపంలోని పీహెచ్‌సీకి, జిల్లా ఆస్పత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో దవాఖానాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సేవలు అందిస్తారు. ఇందులోఒక వైద్యాధికారి, ఇద్దరు ఏఎన్‌ఎంలతో పాటు ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తారు. ప్రజలకు 12 రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. గర్భిణులకు, పిల్లలకు బుధ, శనివారాల్లో వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లలకు టీకాలు వేస్తారు. క్యాన్సర్ మధుమేహ, రక్తపోటు బాధితులకు పల్లె దవాఖానాల్లో తగిన పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. వారంలో ఒక రోజు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రి, పీహెచ్‌సీలకు సిఫారుసు చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా పలు దవాఖానాలకు వైద్యులు లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. చాలా ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్క భవనాలు లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారు.
33చోట్ల ఖాళీలు
పల్లె దవాఖానాలలో 33 చోట్ల వైద్యులు లేకపోవడంతో ఏఎన్‌ఎం వరకే పరిమితం అయ్యాయి. అక్బర్‌పేట్(భూంపల్లి), ధర్మారెడ్డిపల్లి, బంగ్లా వెంకటాపూర్ (అహ్మదీపూర్), గట్లమల్యాల, వడ్లెపల్లి(ఇందుప్రియాల్), పీర్లపల్లి(జగదేవ్‌పూర్), తంగళ్లపల్లి (కోహెడ), ముస్త్యాలపల్లి, అయినాపూర్ (కొమురవెల్లి), కొండపాక, బంధారం, మార్పడగ (కొండపాక)లో వైద్యులు లేరు. అలాగే మంగోల్ (కుకునూరుపల్లి), బైరాన్‌పల్లి, అర్జునపట్ల, దూల్మిట్ట (మద్దూరు), చుంచుకోట(ముస్త్యాల), దామెరకుంట(మర్కూక్), చేర్యాల–1, 3, ప్రశాంత్‌నగర్(పుల్లూరు), రాజక్కపేట, శ్రీగిరిపల్లి ( ప్రజ్ఞాపూర్), రాయవరం, వట్‌పల్లి, చాట్లపల్లి (తీగుల్), దుబ్బాక–ఏ, గుడికందుల, ఆర్‌ఆర్‌కాలనీ(తొగుట), మాజిద్‌పల్లి, గౌరారం, నాచారం, గీర్మాపూర్(వర్గల్) వైద్యులు లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వైద్యం కోసం పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికై నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
త్వరలో భర్తీ చేస్తాం
పల్లె దవాఖానాలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం. ఇందుకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం
– డాక్టర్ పల్వాన్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment