అధికారుల నిర్లక్ష్యమే రైతులను ముంచేను
గాంధీనగర్‌లో తెగులు సోకిన వరి పంట
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు సాగు చేసిన పంటలను అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడం లేదు. దీంతో పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. అలాగే విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ సమయంలో ఎలాంటి మందులు వాడాలనేది తెలియడం లేదు.
హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి మండలాల్లో 68,272 ఎకరాల్లో పంటలు సాగు చేయగ అందులో వరి 53,280, మొక్కజొన్న 12,782, పొద్దుతిరుగుడు 1660, వేరుశనగ 150, ఇతర పంటలు 400 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. యాసంగి సీజన్‌కు ముందు గ్రామాల్లో అవగాహన కల్పించలేక రైతులు వారికి నచ్చిన పంటలను సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతం సాగు నీరు కష్టాలను తప్పించుకొనేందుకు కూడా రైతులు వరి తగ్గించి మొక్కజొన్న పంటను పెంచారు. ప్రైవేటు సీడ్ విత్తన కంపెనీలు గ్రామాలకు రావడంతో వారి దగ్గర విత్తనం తీసుకొని పంట సాగు చేస్తున్నారు. పంటల దిగుబడులు విత్తన కంపెనీలు గ్యారంటీ ఇవ్వకపోవడం, కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చేతుకు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయనే ఆశ రైతులను విత్తన కంపెనీల వైపు చూస్తున్నారు. గాంధీనగర్, తోటపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులు విత్తనం మొలువకపోవడంతో విత్తనం చెడగొట్టి లోకల్ విత్తనం వేసుకొన్నారు. దీంతో రైతలకు పెట్టుబడుల భారం పెరిగింది, సమయం వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్న ఆన్‌లైన్ సమస్య..
వ్యవసాయ అధికారులు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెల్లి రైతులకు విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుల్ల నివారణ పై అవగహన కల్పిస్తే మంచి దిగుబడులు తీస్తారు. క్షేత్ర స్థాయికి వెళ్లిన అధికారులకు రైతులు ఏ పంటలు వేశారనే విషయాలు కూడా తెలుసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సులభమవుతుంది. పంటల క్షేత్రాలకు వెళ్లని అధికారులు ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు లేక పంటలు విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్తే ఆన్‌లైన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వచ్చి పంటలను ఆన్‌లైన్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలించని వ్యవసాయ అధికారులు
సాగుపై రైతులకు కొరవడిన అవగాహన
సబ్సిడీ విత్తనాలపై అందని సమాచారం
బయట మార్కెట్‌లో కొనుగోలు
తెగుళ్ల సమయంలో ఏం మందులు
వాడాలో తెలియని పరిస్థితి
ఆన్‌లైన్‌లో నమోదుకాని పంట వివరాలు
సీసీఐలో అమ్ముకోలేక
దళారులకు విక్రయం
ప్రభుత్వ సబ్సిడీ విత్తన వెనక్కి..
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నేషనల్ సీడ్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల రైతుల కోసం 18 క్వింటాళ్ల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం సరఫరా చేసింది. 10 కిలోల విత్తనం ఖరీదు రూ.275 ఉంటే రూ.100 సబ్సిడీ పోను రైతులు రూ.175 చెల్లించాలి. రైతులకు అధికారులు అదును దాటిన తర్వాత సమాచారం ఇవ్వడంతో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో ఒక రైతు కూడా విత్తనం తీసుకోలేదు. కోహెడ, బెజ్జంకి మండలాల్లో 8 క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకొని సాగు చేశారు. ప్రభుత్వం విత్తనం సరఫరా చేస్తుందని రైతులకు అధికారులు చెప్పకపోవడంతో రైతులు ప్రైవేటు కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు.
రెండు ఎకరాలను చెడగొట్టిన
హైబ్రిడ్ సీడ్ మక్క అంటే ఉత్తర కార్తెల దుక్కిపోతం చేసి విత్తనం పెట్టిన. విత్తనాలు సరిగాలేక మక్క మొలువలేదు. రెండు ఎకరాల మక్క చేను దున్ని మళ్లీ దుకాణానికి వెళ్లి లోకల్ మక్క తెచ్చి పెట్టిన. రూ.15 వేలు ట్రాక్టర్ దున్నకానికి అయ్యింది. మక్కలు పెట్టి పెట్టుబడి ఖర్చు నష్టపోయిన. మా భూమి దగ్గరనే ఏడీఏ ఆఫీసు ఉంటదని, అయినా ప్రభుత్వం సబ్సిడీ విత్తనం వచ్చిందని చెప్పలేదు.
– పోలు మహేందర్, రైతు గాంధీనగర్
పంటల వద్దకు వెళ్లాలని ఆదేశించాం
డివిజన్ పరిధిలోని వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఏఈఓలను పంటల క్షేత్రా లకు వెళ్లాలని ఆదేశించాం. పంటల తెగుళ్ల నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పాం. ఆన్‌లైన్ నమోదు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ నాసిరకం ఉందని రైతులు వద్దంటే తిరిగి పంపించాం. కోహెడ, బెజ్జంకి రైతులు మొక్కజొన్న సాగు చేసుకున్నారు.
– శ్రీనివాస్, ఏడీఏ, హుస్నాబాద్
అధికారుల నిర్లక్ష్యమే రైతులను ముంచేను
Comments
Please login to add a commentAdd a comment