
పనిమంతులు
అతివలే
‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువ
● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు
● కూలీలు 11.29లక్షలు
● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం
మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు.
సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు.
నైపుణ్య శిక్షణ
పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు.
మరిన్ని వసతులు కల్పిస్తే..
ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఉపాధి పనులు చేస్తున్న కార్మికులు

పనిమంతులు