
ఆయిల్‌పామ్ సాగులో మోడల్‌గా నిలపాలి
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్‌పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, సామర్థ్యం, జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంట, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాఖరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్‌ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మార్గదర్శకంగా నిలిచిన తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసి గుజరాత్‌లో క్షీర విప్లవం తెచ్చిన కురియన్‌లా అందరికీ మార్గదర్శకంగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో అధికంగా ఆయిల్‌పామ్ సాగు చేసేలా ప్రోత్సహిస్తామని, పదెకరాల భూమి కొని నేను కూడా అయిల్‌పామ్ సాగు చేస్తానన్నారు. కలెక్టర్ మనూ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో, 230 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరగుతోందని అధిక లాభాలు గడించే పంటను రైతులు సాగు చేయాలన్నారు.
ఉద్యాన అధికారిపై మంత్రి ఆగ్రహం
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించకుండా అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఉద్యాన శాఖ జిల్లా అధికారి సువర్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సాగుపై అధికారులు ఆవగాహన కల్పించడం లేదని, ఆయిల్ గింజలు అమ్మి వారం రోజులు గడిచినా బిల్లు రాలేదని రైతు చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, డీఏఓ రాధిక, అఽధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఆదర్శం కావాలి
జూన్ నెలాఖరులోగా నర్మెట ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు