
బెంగాల్ దంగల్‌లో మమతా బెనర్జీ విజయకేతనం ఎగరవేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాలు బెడిసికొట్టాయి. బెంగాల్ ప్రజలు తిరిగి దీదీకే పట్టం కట్టారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటీకి, తిరిగి మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. కాగా, ఈ ఎన్నిక ఫలితాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ట్విటర్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ట్విటర్‌లో ‘దీదీ ఓ దీదీ సినిమా.. కథనాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, మమతా బెనర్జీ’ అంటూ రాసుకొచ్చారు.
వీడియోలో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి, ఆ మహిళ దగ్గర ఉన్న బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. తెలివిగా ఆ మహిళ తన దగ్గర ఉన్న బ్యాగును దూరంగా విసిరేసి, వారు బ్యాగును తీసుకోవడానికి వెళ్లేలా ఆగంతకుల దృష్టి మరల్చి వారి బైకును తీసుకొని పారిపోయింది. దీంతో ఆగంతకులు బిత్తరపోయి, ఒకరి మోహాళ్లు ఒకరు చూసుకుంటారు. అటువైపుగా వెళ్తున్న వారి నుంచి ఆ మహిళ బైక్‌పై తిరిగి వచ్చి తన బ్యాగును తీసుకొనిపోతుంది. ఆర్జీవీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఈ వీడియోతో పోల్చారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు.
DIDI O DIDI film ..starring Mamta,Modi and Amit pic.twitter.com/eNaRGT9wkS
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2021