
ఐపీఎల్-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేటలో మొత్తం పది జట్లు మరోసారి తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్‌లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది.
గతేడాది సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్‌కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
"కెప్టెన్‌గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవకాశం. ఒకప్పుడు అతడు రోహిత్ శర్మ వారుసుడిగా కొనసాగాడు. రోహిత్ శర్మ గైర్హజారీలో భారత జట్టు కెప్టెన్‌గా అతడు వ్యవహరించేవాడు. వైట్‌బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా ఊహించారు.
కానీ సడన్‌గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను తప్పించారు. హార్దిక్ గురించి ప్రస్తుతం ఎవరూ చర్చించడం లేదు. అతడిని కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తను ముందుకు వచ్చి అదుకునేవాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు కూడా చేర్చాడు.
ఈ సీజన్‌లో హార్దిక్ కెప్టెన్‌గా తన తను నిరూపించుకుంటే మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment