SL Vs PAK: Abdullah Shafique Creates New World Record During Unbeaten 160 Run Knock In 1st Test Vs Sri Lanka - Sakshi
Sakshi News home page

SL vs PAK: పాకిస్తాన్‌ ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..!

Published Thu, Jul 21 2022 12:34 PM | Last Updated on Thu, Jul 21 2022 1:29 PM

Abdullah Shafique creates new world record during unbeaten 160 run knock in 1st Test vs Sri Lanka - Sakshi

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 160 పరుగులతో ఆజేయంగా నిలిచి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 408 బంతులను ఎదుర్కొన్నాడు.  ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అబ్దుల్లా షఫీక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్‌ సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాటర్‌గా షఫీక్ రికార్డులకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో 524 నిమిషాలు పాటు షఫీక్ క్రీజులో ఉన్నాడు.  అంతకు ముందు ఈ రికార్డు.. 1998లో జింబాబ్వేపై ఛేజింగ్‌లో 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. అదే విధంగా ఛేజింగ్‌లో 400 బంతులు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. అంతకు ముందు 1928-29లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 462 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.

దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. షఫీక్ కంటే ముందు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఈ ఘనత సాధించారు. అదే విధంగా టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన మూడో పాక్‌ ఆటగాడిగా షఫీక్ నిలిచాడు.


చదవండి: NZ vs IRE: తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement