![Achievers: Boxer Mike Tyson Life Story Career Interesting Facts - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/16/myketyson.jpg.webp?itok=IKw-Wza-)
1986 నవంబర్ 22 .. వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్. అప్పటికి విజేతగా ఉన్న జమైకా బాక్సర్ ట్రెవర్ బెర్బిక్ తన టైటిల్ నిలబెట్టుకునేందుకు తయారయ్యాడు. ఎదురుగా 20 ఏళ్ల కుర్రాడొకడు తనతో పోటీకి సిద్ధమయ్యాడు. అప్పటికే ఆ కుర్రాడు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నా సరే.. ఒకప్పుడు మొహమ్మద్ అలీనే ఓడించిన రికార్డు ఉన్న బెర్బిక్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు.
మొత్తం 12 రౌండ్‌ల పోరు.. రెండో రౌండ్‌లో ఆ కొత్త బాక్సర్ విసిరిన ఒక పదునైన పంచ్‌కు బెర్బిక్ కుప్పకూలాడు. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసి మళ్లీ పడిపోయాడు. మరోసారి కూడా అలాగే శక్తి కూడదీసుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాక కింద పడిపోయాడు! ఒక్క దెబ్బకు బెర్బిక్ మూడు సార్లు నేలకూలాడు!
అప్పటికి జరిగింది 2 నిమిషాల 35 సెకన్ల పోరు మాత్రమే. రిఫరీ వచ్చి ఆటను ఆపేశాడు. కొత్త కుర్రాడిని వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా ప్రకటించాడు. ఆ పంచ్ గురించి గర్వంగా చెప్పుకున్న, తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించుకున్న ఆ బాక్సర్ పేరే ‘మైక్ టైసన్’. సుదీర్ఘకాలం పాటు ఒక తరం మొత్తానికి బాక్సింగ్ అంటే టైసన్ మాత్రమే అనిపించుకున్న మహాబలుడు.
‘అమ్మను నేను ఎప్పుడూ సంతోషంగా చూడలేదు. నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోయాను. వీథుల్లో నేను ఆవారాగా తిరుగుతూ గొడవలు పడుతుంటానని ఆమెకు తెలుసు. ప్రతిరోజూ కొత్త బట్టలతో వస్తుంటే అవి నేను కొన్నవి కాదనీ ఆమెకు తెలుసు.
అసలు అమ్మతో నేను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అంటూ తన బాల్యం, తల్లి గురించి టైసన్ చెప్పుకున్న మాటలు అవి. నిజంగానే దశాదిశా లేని జీవితం. పట్టించుకోని తండ్రి.. గల్లీ గూండాలతో సాన్నిహిత్యం.. డీలర్ల నుంచి డ్రగ్స్ దొంగతనం.. టైసన్ చిన్నతనమంతా ఇలాగే సాగింది. 13 ఏళ్ల వయసు వచ్చే సరికే టైసన్ 38 సార్లు అరెస్ట్ అయ్యాడు.
జైలర్ వల్లే
అయితే టీనేజర్‌గా జైలుకు వెళ్లిన సమయం కూడా చివరకు అతని జీవితానికి కొత్త దారిని చూపించింది. ఒక స్ట్రీట్ ఫైటర్ స్థాయి నుంచి వరల్డ్ చాంపియన్‌గా నిలిపింది. టైసన్‌లోని ఆవేశాన్ని సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని గుర్తించిన వ్యక్తి అక్కడి జైలర్.. మాజీ బాక్సర్ కూడా అయిన బాబీ స్టివార్ట్! టైసన్ పవర్‌ను పద్ధతిగా ఉపయోగించుకునేలా చేశాడు.
స్టివార్ట్‌తో పాటు తల్లి తాను చనిపోతూ టైసన్‌ను అప్పగించిన వ్యక్తి కస్ డి అమాటో.. ఆ తర్వాత టైసన్ దిగ్గజ బాక్సర్‌గా మారేందుకు దిశానిర్దేశం చేశాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తాను ఇష్టపడే పావురం మెడ విరిచాడనే కోపంతో వీథిలో ఒక పెద్ద రౌడీ మెడవిరిచి తనలో ఆవేశాన్ని ప్రదర్శించిన టైసన్ ఆ తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులను తన నాకౌట్ పంచ్‌లతో కుప్పకూల్చాడు.
ఆరంభం అదిరేలా..
కెరీర్ ఆరంభంలో టైసన్ అమెచ్యూర్ బాక్సర్‌గా రాణించాడు. వరుసగా రెండేళ్లు జూనియర్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించాడు. అయితే అతని కోచ్‌లు, ప్రమోటర్లు వాటిని టైసన్ స్థాయికి మరీ చిన్నవిగా భావించారు. అందుకే అన్ని రకాలుగా సిద్ధం చేసి పదునైన ప్రొఫెషనల్ రింగ్‌లోకే దింపారు.
టైసన్ వారి అంచనాలను వమ్ము చేయలేదు. 18 ఏళ్ల వయసులో తొలిసారి అసలు పోరులోకి దిగిన టైసన్ తొలి మ్యాచ్‌లో హెక్టర్ మెర్సిడెజ్‌తో తలపడ్డాడు. టెక్నికల్ నాకౌట్ ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేసిన టైసన్‌ను చూడగానే అందరికీ కొత్త చాంపియన్ వచ్చాడని అర్థమైంది. అక్కడితో మొదలైన విజయ ప్రస్థానం 37 బౌట్‌ల వరకు సాగింది. వీటిలో తొలి 26 బౌట్‌లలోనైతే అతను ఏకపక్షంగా విరుచుకుపడ్డాడు.
ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వని ఈ పోటీలన్నీ నాకౌట్ లేదా టెక్నికల్ నాకౌట్ ద్వారా ముగిశాయి. ఈ ప్రదర్శన చూస్తేనే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. 20 ఏళ్ల 145 రోజుల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన అతను ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
‘బాక్సింగ్ భవిష్యత్ గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ ఆటకు ప్రాచుర్యపరంగా శిఖరానికి తీసుకెళ్లగలవాడు వచ్చేశాడు’ అంటూ విశ్లేషకులంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
కొనసాగిన జోరు
అతి బలమైన శరీరం, వేగంగా దూసుకొచ్చే చేయి, తీవ్రత, కచ్చితత్వంతో పాటు ఎప్పుడు పంచ్ విసరాలో తెలిసిన టైమింగ్‌తో టైసన్ బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించాడు. ప్రత్యర్థి శరీరంపై కుడి చేత్తో హుక్ చేసిన వెంటనే అప్పర్‌కట్‌తో దవడపై వరుసగా దాడి చేసే శైలికి ఎదురులేకుండా పోయింది. పైగా బలమైన డిఫెన్స్ అవతలి బాక్సర్‌లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
అతని ఈ ఆటపై అప్పట్లో ‘మైక్ టైసన్స్ పంచ్ అవుట్’ పేరుతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చి సూపర్ హిట్ అయిందంటే అతని పాపులారిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో బాక్సింగ్ ప్రపంచాన్ని నడిపిస్తున్న మూడు వేర్వేరు సంఘాలు వేర్వేరు వరల్డ్ చాంపియన్ షిప్‌లను నిర్వహిస్తుండేవి. అలా డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ నిర్వహించిన వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ షిప్‌లలో గెలిచి ఈ మూడింటిలో ఒకేసారి చాంపియన్ గా నిలిచిన ఏకైక బాక్సర్‌గా చరిత్రలో నిలిచాడు టైసన్.
ఆ ఒక్క ఓటమితో..
వరుసగా 37 బౌట్‌లలో విజయాలు, అన్ని హెవీవెయిట్ పోటీల్లోనూ విశ్వవిజేత, అప్రతిహతంగా సాగిపోతున్న మైక్ టైసన్ కు 1990 ఫిబ్రవరిలో షాక్ తగిలింది. తన మూడు టైటిల్స్‌ను కాపాడుకునేందుకు జేమ్స్ బస్టర్ డగ్లస్‌తో టైసన్ పోటీ పడాల్సి వచ్చింది.
అప్పటికే కొంత కాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీస్‌కు కూడా తగినంత సమయం ఇవ్వలేకపోయిన టైసన్ ఈ పోరుకు వచ్చాడు. అయినా సరే అతనిపై 42–1 తేడాతో బెట్టింగ్ అంచనాలు ఉన్నాయి. కానీ 10 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు టైసన్ తడబడ్డాడు. 82 సెకన్ల వ్యవధిలో ముగిసిన పోరులో టైసన్ ఓడి తన మూడు టైటిల్స్‌ను కోల్పోయాడు.
అతని కెరీర్‌లో ఇదే తొలి పరాజయం. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత సంచలన ఫలితాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ పరాజయం అప్పటికప్పుడు టైసన్ కు నష్టం కలిగించకపోయినా ఆటపై అతని ఏకాగ్రత చెదిరినట్లు బాక్సింగ్ ప్రపంచం గుర్తించింది. డగ్లస్‌తో పోరు తర్వాత మరికొన్ని విజయాలు దక్కినా, అవి మునుపటి టైసన్ ను చూపించలేకపోయాయి.
టైసన్‌ను కూడా ఓడించవచ్చనే విషయాన్ని గుర్తించేలా చేశాయి. తర్వాతి తొమ్మిదేళ్ల కెరీర్‌లో 12 బౌట్‌లలో పాల్గొన్న టైసన్ ఐదింటిలో పరాజయం చవిచూడటం అతనిలో సత్తా తగ్గిందని నిరూపించాయి. దాంతో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. హోలీఫీల్డ్, లెనాక్స్ లూయీ లాంటి స్టార్లతో పాటు కెరీర్ చివర్లో డానీ విలియమ్స్, కెవిన్ మెక్‌బ్రైన్ లాంటి అనామకులు కూడా టైసన్ ను ఓడించగలిగారు.
ఆద్యంతం వివాదాలమయం..
ఒక దశలో తన పంచ్‌లతో ప్రపంచాన్ని శాసించిన మహా బాక్సర్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆరేళ్ల జైలుశిక్షకు గురి కావడంతో టైసన్ పతనం మొదలైంది. శిక్ష తగ్గించుకొని మూడేళ్లకే బయటకు వచ్చినా ఇతరత్రా కూడా అతనిలోని ‘పాత టైసన్ ’ బయటకు వచ్చి కెరీర్‌ను నాశనం చేశాడు.
వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం
వివాదాల కారణంగా అప్పటికే తెచ్చుకున్న పేరుప్రతిష్ఠలను కోల్పోవడమే కాకుండా తను ఆర్జించిన కోట్లాది సంపద కూడా ఆవిరైంది. బాక్సింగ్ రింగ్‌లో చూస్తే ఓటమి ఎదురువుతున్న దశలో పంచ్‌లతో కాకుండా హోలీఫీల్డ్ ‘చెవి కొరికి’ డిస్‌క్వాలిఫై కావడం అతని చక్కటి కెరీర్‌లో మచ్చగా మిగిలిపోయింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా బయట అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం, డోపింగ్, కోర్టు వివాదాలు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ నెగెటివ్ వార్తలే!
అద్భుతమైన అతని కెరీర్‌ను మరచి అతన్ని ఒక దుర్మార్గుడిలా చిత్రీకరించాయి. తన ఆత్మకథ ‘ద అన్ డిస్ప్యూటెడ్ ట్రూత్’లో అతను ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. అమెరికాలో పలు టీవీ సిరీస్‌లలో నటించిన టైసన్ ఇటీవల తెలుగు సినిమా ‘లైగర్’లోనూ కనిపించాడు. అయితే టైసన్‌లోని ‘విలన్’ను పక్కన పెట్టి చూస్తే క్రీడా ప్రపంచంలో ఎదురు లేని ‘హీరో’ల్లో ఒకడిగా టైసన్ నిలిచిపోతాడనేది నిజం!
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment