సాక్షి, వెబ్‌డెస్క్: ‘‘ఏం అర్థం కావడం లేదు. కానీ చూడటానికి మాత్రం బాగుంది’’.. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఇది. నిజమే.. గోల్ఫ్ అంటే ఏంటో తెలియని వాళ్లను కూడా టీవీని అతుక్కుపోయేలా చేసింది మన అమ్మాయి. తొలిసారి ఫైనల్‌కు చేరిన అతిదిని ఉద్దేశించి అభిమానులంతా.. ‘‘కమాన్ అదితి.. నీకోసం మేమంతా ప్రార్థిస్తున్నాం’’ అని ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. ఫలితం ఎలా ఉన్నా అదితి పోరాటం స్ఫూర్తిదాయకం. మూడు రౌండ్ల వరకు ఆమె సాగించిన ప్రయాణం నవతరానికి మార్గదర్శనం. పతకం చేజారినా అదితి అద్భుత ప్రదర్శన భారతీయులను గర్వపడేలా చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై కురుస్తున్న ప్రశంసల వర్షమే ఇందుకు నిదర్శనం.
ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. రిచ్చెస్ట్ గేమ్‌గా పేరొందిన గోల్ఫ్ గురించి మనలో చాలా మందికి బేసిక్ రూల్స్, పదాల గురించి కూడా అవగాహన ఉండదు కదా! అయితేనేం, అదితి ఆడుతున్నంత సేపు అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా పార్స్, బర్డీస్, ఈగల్స్, బొగేస్ అన్న పదాల గురించి సోషల్ మీడయాలో చర్చ జరిగింది. అసలు వీటికి అర్థాలేంటి? గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో విజేతను ఎలా తేలుస్తారన్న అంశాల గురించి సంక్షిప్త సమాచారం మీకోసం..
►సాధారణంగా పచ్చికతో లేదా ఇసుకతో నిండి ఉన్న విశాలమైన ప్రదేశంలో స్టిక్‌తో ప్రత్యేక బంతిని గమ్యస్థానమైన నిర్ణీత రంధ్రంలోకి ముందుకు తీసుకెళ్లడమే గోల్ఫ్ లక్ష్యం. గోల్ఫ్ కోర్సులో 9 లేదా 18 రంధ్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి పరస్పర విరుద్ధ రూపాలు, లక్షణాలు కలిగి ఉంటాయి. బంతిని హోల్‌లోకి కొట్టేందుకు కనీసమైన స్ట్రోకులు(షాట్లు) చేయాల్సి ఉంటుంది.
పార్: ప్రొఫెషనల్ గోల్ఫర్.. గోల్ఫ్ కోర్సులోని ఒక నిర్ణీత హోల్‌లోకి ఎన్ని స్ట్రోక్‌లలో బంతిని చేర్చారన్న స్కోరును తెలిపేదే పార్. సింపుల్‌గా చెప్పాలంటే.. స్ట్రోకుల సంఖ్యను ‘పార్’ సూచిస్తుంది.
►హోల్స్ పొడవు, లక్షణాల ఆధారంగా పార్-3(హోల్‌లో బంతిని చేర్చేందుకు మూడు స్ట్రోకులు), పార్-4, పార్-5.. అరుదుగా పార్-6.. గోల్ఫ్ కోర్సు స్వరూపం, రేటింగ్‌ను నిర్ణయిస్తారు.
►ఇక నిర్ణీత స్ట్రోకుల కంటే తక్కువ షాట్స్‌లోనే లక్ష్యాన్ని చేరితే.. సదరు గోల్ఫర్ స్కోరును అండర్ పార్‌తో సూచిస్తారు. అంతకంటే ఎక్కువ స్ట్రోకులు తీసుకుంటే ఓవర్ పార్ అంటారు.
►బర్డీ, ఈగల్స్, బొగేస్ అనేవి ఒక గోల్ఫర్ ప్రదర్శనకు కొలమానంగా నిలిచే అంశాలు.
►బర్డీ- ఒక హోల్‌లో బంతిని చేర్చేందుకు అవసరమైన నిర్ణీత స్ట్రోకుల కంటే కచ్చితంగా ఒక స్ట్రోకు తక్కువగా ఉంటే దానిని (1- అండర్ పార్) బర్డీగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు.. పార్-5 హోల్‌ను పూర్తి చేసేందుకు కేవలం నాలుగు స్ట్రోకులు మాత్రమే అవసరమైతే దానిని బర్డీ అంటారు.
►బొగే- అదే విధంగా నిర్ణీత స్ట్రోకుల కంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే.. 1-ఓవర్ పార్ ఆన్ హోల్‌ను బొగేగా వ్యవహరిస్తారు. 2- ఓవర్ పార్ అయితే డబుల్ బొగే, 3- ఓవర్ పార్ అయితే ట్రిపుల్ బొగే అంటారు.
►ఈగల్- 2-అండర్ పార్ ఆన్ హోల్‌ను ఈగల్ అంటారు. అత్యంత అరుదుగా నమోదయ్యే 3- అండర్ పార్‌ను డబుల్ ఈగల్ అంటారు.
పార్-3, పార్-, పార్-5 హోల్స్.. గోల్ఫ్ స్కోరింగ్ ఇలా
పార్-5 హోల్:
►డబుల్ ఈగల్: పార్- 5 స్కోరింగ్ అంటే.. రెండు స్ట్రోకుల్లోనే లక్ష్యం పూర్తిచేసినట్లు అర్థం. అదే విధంగా... ఈగల్- 3 స్ట్రోకులు, బర్డీ- 4 స్ట్రోకులు, పార్- 5 స్ట్రోకులు, బొగే- 6 స్ట్రోకులు, డబుల్ బొగే- 7 స్ట్రోకులు, ట్రిపుల్ బొగే- 8 స్ట్రోకులలో టార్గెట్ ముగించినట్లన్న మాట.
పార్- 4 హోల్.. లక్ష్యం పూర్తి చేసే విధానం, స్కోరు.
►డబుల్ ఈగల్- పార్-4: ఒకే ఒక్క స్ట్రోకులో లక్ష్యాన్ని చేరడం(దాదాపు అసాధ్యం)
ఈగల్- 2 స్ట్రోక్స్‌లో.. బర్డీ: 3 స్ట్రోక్స్‌లో.. పార్- 4 స్ట్రోక్స్‌లో.. బొగే- 5 స్ట్రోక్స్‌లో.. డబుల్ బొగే- 6 స్ట్రోక్స్‌లో.. ట్రిపుల్ బొగే- 7 స్ట్రోక్స్‌లో
పార్-3 హోల్:
►డబుల్ ఈగల్- పార్-3 హోల్‌లో డబుల్ ఈగల్ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్క షాట్ కూడా ఆడకుండా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం.
►ఈగల్- ఒకే ఒక స్ట్రోక్‌తో లక్ష్యాన్ని చేరుకోవడం
►బర్డీ- 2 స్ట్రోకుల్లో
►పార్- 3 స్ట్రోకుల్లో
►బొగే- 4 స్ట్రోకుల్లో
►డబుల్ బొగే- 5 స్ట్రోకుల్లో
►ట్రిపుల్ బొగే- 6 స్ట్రోకుల్లో
అంటే, తక్కువ షాట్స్‌లో బంతిని హోల్‌లో చేర్చిన వారినే విజేతగా నిర్ణయిస్తారన్న మాట. శుక్రవారం నాటి టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన కోర్డా నెల్లే స్వర్ణ పతక విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇనామీ మోనె(జపాన్), కో లిడియా(న్యూజిలాండ్) రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నారు. అదితి నాలుగో స్థానానికే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment