పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ అద్భుత విజయం సాధించింది. పటిష్ట పేస్ దళం ఉన్న బాబర్ ఆజం బృందాన్ని చిత్తుచేసి తాను పసికూన కాదని బెబ్బులిలా గర్జించింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మూడో విజయం నమోదు చేసి తనను తక్కువ అంచనా వేయొద్దని మేటి జట్లకు సవాలు విసిరింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఓడించి సత్తా చాటిన అఫ్గాన్ తాజాగా సెమీస్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్న పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
చెన్నైలోని చెపాక్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించగా వన్ డౌన్ బ్యాటర్ బాబర్ ఆజాం 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో 40 పరుగులు సాధించారు.
దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ రెండు.. మహమ్మద్ నబీ, అజ్మతుల్లా చెరో వికెట్ దక్కించుకున్నారు.
టార్గెట్ ఛేదనలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహమనుల్ల గురుబాజ్ 53 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతో రాణించాడు. ఇక వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రహమత్ షా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వీరిద్దరూ ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు. చక్కటి సమన్వయంతో వికెట్ల మధ్య చురుగ్గా కదులుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రహమత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు తొలి గెలుపునందించారు. 49వ ఓవర్ ఆఖరి బంతికి హష్మతుల్లా ఫోర్ బాదడంతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Creating history, one victory at a time 🇦🇫#CWC23 #PAKvAFG pic.twitter.com/ImtYjnMvIQ
— ICC (@ICC) October 23, 2023
Comments
Please login to add a commentAdd a comment