టీమిండియా వెటరన్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్య రహానే గ్యారేజీలో కొత్త కారు చేరింది. మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 వేరియంట్‌ను రహానే కొనుగోలు చేశాడు. ఈ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత అజింక్య రహానేది. ఆస్ట్రేలియా గడ్డపై అతడి కెప్టెన్సీలోనే టీమిండియా మొట్టమొదటిసారి టెస్టు సిరీస్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఫామ్‌లేమి కారణంగా తిరిగి జట్టులో చోటు సంపాదించలేకపోయిన రహానే.. ఐపీఎల్ వైపు దృష్టిసారించాడు.
ఈ క్రమంలో మెగా వేలం-2023లో రూ. 50 లక్షల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ తప్ప ఇతర జట్లేవీ అతడిపై ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. రహానేను బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేసేలా పావులు కదిపాడు.
అంతేకాదు.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రహానేకు వరుస అవకాశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో టెస్టు ఆటగాడిగా ముద్రపడ్డ రహానే.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకుని టీ20లకూ తాను పనికివస్తానని నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలో తిరిగి టీమిండియాలో అడుగుపెట్టినా.. తనకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం భాగమయ్యే ఛాన్స్ కొట్టేసిన అజింక్య రహానే.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024 సీజన్‌తో బిజీగా ఉన్నాడు.
అతడి సారథ్యంలోని ముంబై జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రంజీ తాజా ఎడిషన్‌లో కెప్టెన్‌గా పర్వాలేదనిపించినా.. బ్యాటర్‌గా మాత్రం రహానే విఫలమయ్యాడు. ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదిలా ఉంటే.. ఆట నుంచి కాస్త విరామం దొరకగానే అజింక్య రహానే కుటుంబంతో కలిసి కారు కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ప్రకారం.. భార్య రాధికాతో కలిసి రహానే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 మోడల్ కారును కొన్నాడు.
దీని ధర సుమారు రూ. 3.25 కోట్లు అని అంచనా. కాగా 2022లో రహానే బీఎండబ్ల్యూ 6 సిరీస్ స్పోర్ట్ వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని కోసం అతడు రూ. 69 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రహానే గ్యారేజీలో వీటితో పాటు ఆడి క్యూ5, మారుతి వాగ్నర్ కూడా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో జరిగే క్వార్టర్ ఫైనల్ సందర్భంగా రహానే మళ్లీ ముంబై సారథిగా మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment