ఐదేసిన అనికేత్‌.. హైదరాబాద్‌ విజయలక్ష్యం 296 | Ranji Trophy 2024-25: Anikethreddy Fifer Keeps Hyderabad Alive Against Gujarat, Check Full Score Details | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024-25: ఐదేసిన అనికేత్‌.. హైదరాబాద్‌ విజయలక్ష్యం 296

Published Mon, Oct 14 2024 7:35 AM | Last Updated on Mon, Oct 14 2024 9:28 AM

Anikethreddy fifer keeps Hyderabad alive against Gujarat

సాక్షి, హైదరాబాద్‌: లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అనికేత్‌ రెడ్డి (5/36) సత్తా చాటడంతో సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ 62.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఉమంగ్‌ కుమార్‌ (113 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించగా... సిద్ధార్థ్‌ దేశాయ్‌ (32), తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో మనన్‌ హింగ్‌రాజియా (25) ఫర్వాలేదనిపించారు.

హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 5, సీవీ మిలింద్, తనయ్‌ త్యాగరాజన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 93.4 ఓవర్లలో 343 పరుగులు చేయగా... హైదరాబాద్‌ 89.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (90 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హిమతేజ (184 బంతుల్లో 66; 11 ఫోర్లు), సీవీ మిలింద్‌ (83 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు.

ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (0), అభిరథ్‌ రెడ్డి (2) నాలుగు ఓవర్లలోపే పెవిలియన్‌కు చేరగా... వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాధేశ్‌ (8), తనయ్‌ త్యాగరాజన్‌ (1) ప్రభావం చూపలేకపోయారు. అప్పటికే గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా... హైదరాబాద్‌కు సరైన ఆరంభం దక్కలేదు. స్కోరు బోర్డు మీద రెండు పరుగులు నమోదయ్యేసరికి రెండు వికెట్లు పడ్డాయి.

ఈ దశలో రోహిత్‌ రాయుడు (23)తో కలిసి కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత హిమతేజ,  మిలింద్‌ చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడటంతో హైదరాబాద్‌ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఏడో వికెట్‌కు మిలింద్‌తో కలిసి హిమతేజ 99 పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 95 పరుగులతో కలుపుకొని ఓవరాల్‌గా గుజరాత్‌ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... మరి ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ బ్యాటర్లు చేధిస్తారా చూడాలి!
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేళ జయవర్దనే
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement