
అండర్-19 వరల్డ్‌కప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో కులకర్ణి 108 పరుగులు చేశాడు.
అతడితో పాటు ముషీర్ ఖాన్(73), కెప్టెన్ ఉదయ్ సహారన్(35) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో సుబ్రమణ్యన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరిన్, ఆర్యా గార్గ్, రిషి రమేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ 8 ఓవర్లలో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు తివారీ రెండు వికెట్లు పడగొట్టగా.. రాజ్ లింబానీ ఒక్క వికెట్ సాధించారు.