వచ్చే నెలలో టి20 ప్రపంచకప్
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.
తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి.
అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని.
Comments
Please login to add a commentAdd a comment