Aus A vs Ind A: ముకేశ్‌ దెబ్బకు.. ‘జూనియర్‌ రికీ పాంటింగ్‌’ డకౌట్‌.. కానీ | Aus A vs Ind A 1st Test Day 1 Stumps: India 107 All Out, Ausies 99 For 4 | Sakshi
Sakshi News home page

Aus A vs Ind A: ముకేశ్‌ దెబ్బకు.. ‘జూనియర్‌ రికీ పాంటింగ్‌’ డకౌట్‌.. కానీ

Oct 31 2024 1:46 PM | Updated on Oct 31 2024 2:28 PM

Aus A vs Ind A 1st Test Day 1 Stumps: India 107 All Out, Ausies 99 For 4

స్యామ్‌ కన్‌స్టాస్‌ డకౌట్‌ (PC: cricket.com.au)

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్‌ సేనకు గట్టి షాక్‌ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.

బ్యాటర్లు విఫలం
ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌(7), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(0) సహా బాబా ఇంద్రజిత్‌(9), వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌(4), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్‌ సుతార్‌(1), ప్రసిద్‌ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌(21)తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌(36), టెయిలెండర్‌ నవదీప్‌ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్‌ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో బ్రెండన్‌ డాగెట్‌ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్‌ ఫెర్గూస్‌ ఒ నీల్‌, స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

 

ఆసీస్‌కూ ఆదిలోనే షాక్‌.. ‘జూనియర్‌ రికీ పాంటింగ్‌’ డకౌట్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్‌ రికీ పాంటింగ్‌’గా పేరొందిన ఓపెనర్‌ స్యామ్‌ కన్‌స్టాస్‌(Sam Konstas)ను డకౌట్‌ చేశాడు. 

మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్‌ ముకేశ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.

టీమిండియాతో టెస్టుకు ఆసీస్‌ ఓపెనర్ల పోటీలో 
కాగా 19 ఏళ్ల స్యామ్‌ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్‌-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్‌ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్‌ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్‌ తగిలింది.

పాతుకుపోయిన కెప్టెన్‌
ఇదిలా ఉంటే.. ప్రసిద్‌ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్‌ చేసిన ప్రసిద్‌.. తర్వాత ఆసీస్‌-ఎ మరో ఓపెనర్‌​ మార్కస్‌ హ్యారిస్‌(17) వికెట్‌ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్‌లో వచ్చిన కెప్టెన్‌ నాథన్‌ మెక్స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.

అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్‌(33) రాణించాడు. అయితే, ముకేశ్‌ కుమార్‌ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్‌ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్‌ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్‌ 29, కూపర్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్‌ భారత్‌- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)
👉వేదిక: గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌ ఎరీనా, మెక్‌కే
👉టాస్‌: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్‌
👉భారత్‌ స్కోరు: 107
👉ఆసీస్‌ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్‌ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజ

తుదిజట్లు
ఆస్ట్రేలియా-ఎ
స్యామ్‌ కన్‌స్టాస్‌, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌, నాథన్ మెక్స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్‌, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్హామ్.

భారత్‌- ఎ
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్.

చదవండి: IPL 2025: షాకింగ్‌.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్‌కే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement