ఆసీస్- భారత్ అనధికారిక తొలి టెస్టు(PC: X)
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.
బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు.
మూకుమ్మడిగా విఫలం
కాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది.
అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.
దేశవాళీల్లో సత్తా చాటి...
11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .
ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్‌కే తొలి ప్రాధాన్యత ఉంది.
గాయాల నుంచి కోలుకుని
ఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది.
ఐపీఎల్‌లో మెరుపు బ్యాటింగ్‌తో
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్‌లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.
అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్‌లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్‌పైనే ఉంది.
టెస్టు క్రికెటర్లు కూడా...
భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్‌లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.
ఆసీస్ క్రికెటర్లకూ పరీక్ష
ఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు.
మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.
ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.
‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం.
చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2
— Div🦁 (@div_yumm) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment