నటరాజన్‌కు సహచరుల అభినందన, లబ్‌షేన్
బుమ్రా లేడు. అశ్విన్ ఆడలేదు. ఇద్దరు కొత్త బౌలర్లు... మరొకరు పట్టుమని పది ఓవర్లు కూడా వేయకుండా తప్పుకున్నాడు. అయినా సరే... ‘గాబా’ మైదానంలో తొలి రోజు ఎక్కువ భాగం భారత జట్టు ప్రత్యర్థిపై పట్టును నిలబెట్టుకుంది. ఆరంభంలో 17/2 వద్ద ఆ తర్వాత 213/5 వద్ద టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కని పించింది. అయితే అదే అనుభవలేమి కారణంగానే పట్టు సంపాదించాల్సిన చోట తడబడి కంగారూలను పూర్తిగా కుప్పకూల్చే అవకాశం టీమిండియాకు చేజారింది. లబ్‌షేన్ ఆదుకోవడంతో కీలకదశలో కోలుకున్న ఆస్ట్రేలియా సంతృప్తికర స్కోరు వద్ద తొలి రోజు ఆటను ముగించింది. రెండో రోజు మన బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి మిగిలిన ఐదు వికెట్లను త్వరగా పడగొడతారా? లేక ఆసీస్ భారీ స్కోరు సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు మ్యాచ్‌ను తమకు అచ్చొచ్చిన మైదానంలో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబ్‌షేన్ (204 బంతుల్లో 108; 9 ఫోర్లు) కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం కెప్టెన్ టిమ్ పైన్ (62 బంతుల్లో 38 బ్యాటింగ్; 5 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (70 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో నటరాజన్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఓపెనర్ల వైఫల్యం...
ఆస్ట్రేలియాకు ఓపెనర్లు కలిసిరాక మరోసారి పేలవ ఆరంభం లభించింది. ఫిట్‌గా లేకపోయినా వరుసగా రెండో టెస్టులో తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (1) మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. హైదరాబాద్ పేసర్ సిరాజ్ వేసిన బంతికి వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. గత ఐదు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ చేయకపోయినా... చివరి నిమిషంలో టెస్టు అవకాశం దక్కించుకున్న మార్కస్ హారిస్ (5)ను శార్దుల్ తన తొలి బంతికి పెవిలియన్ పంపించాడు.
ఈ దశలో లబ్‌షేన్, స్టీవ్ స్మిత్ (77 బంతుల్లో 36; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టడంతో లంచ్ వరకు ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా శార్దుల్ బౌలింగ్‌లో స్మిత్ దూకుడు ప్రదర్శించాడు. అతను కొట్టిన ఐదు ఫోర్లూ శార్దుల్ బౌలింగ్‌లోనే రావడం విశేషం. అయితే రెండో సెషన్‌లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేసిన చక్కటి బంతిని నేరుగా షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లోకి కొట్టి స్మిత్ అవుటయ్యాడు. ఇది సుందర్‌కు తొలి టెస్టు వికెట్ కావడం విశేషం. ఈ దశలో మరోసారి భారత్‌దే పైచేయిగా కనిపించింది.
శతక భాగస్వామ్యం...
రెండుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన లబ్‌షేన్ 145 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు మాథ్యూ వేడ్ (87 బంతుల్లో 45; 6 ఫోర్లు) నుంచి అతనికి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించారు. శార్దుల్ వరుస ఓవర్లలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెరో రెండు ఫోర్లు కొట్టారు. 100 పరుగులు జోడించిన ఈ జంటను విడదీసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోగా... చివరకు వేడ్ తానే ఒక చెత్త షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు.
నటరాజన్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన వేడ్ మిడాన్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఇది నటరాజన్ మొదటి టెస్టు వికెట్. 195 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న లబ్‌షేన్‌ను తన తర్వాతి ఓవర్లోనే అవుట్ చేసి నటరాజన్ భారత్‌ను మళ్లీ ముందంజలో నిలిపాడు. అయితే పైన్, గ్రీన్ పట్టుదలగా ఆడటంతో భారత్‌కు పూర్తిగా పట్టు చిక్కలేదు. తడబాటు లేకుండా టీమిండియా బౌలింగ్‌ను ఎదుర్కొని మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు కొత్త బంతితో ఆరు ఓవర్ల పాటు ఎలాంటి ప్రమాదం లేకుండా ముగించగలిగారు.
ఐదుగురు బౌలర్లు...
3 1/4 మ్యాచ్‌ల అనుభవం!
బ్రిస్బేన్‌లో తుది ఫలితం ఎలా ఉంటుందో కాస్త మరచిపోండి! ఇప్పుడు భారత జట్టు మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది కూడా అనవసరం! అంకెల్లో కనిపించే విజయాన్ని కాస్త పక్కన పెట్టి చూస్తే చివరి టెస్టులో తొలి బంతి పడటానికి ముందే భారత్ మనసుల్ని గెలిచేసింది! మొదటి రోజు భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన, ప్రత్యర్థిని వారి సొంతగడ్డపై కట్టడి చేసిన తీరును ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. టెస్టు ఆరంభానికి ముందు సిరాజ్ అనుభవం 2 మ్యాచ్‌లు, సైనీ 1 మ్యాచ్, శార్దుల్ ఒక పూర్తి మ్యాచ్ కూడా కాదు (ఏకైక టెస్టులో అతను వేసినవి 10 బంతులే), ఇద్దరు అరంగేట్రం ఆటగాళ్లు. ఆ మాటకొస్తే సిరీస్‌కు ముందు ఒక్కరి ఖాతాలో ఒక్క వికెట్ కూడా లేదు.
భారత్ టెస్టుల్లో అడుగు పెట్టినప్పుడు తప్ప ఇలా ఎప్పుడూ జరగలేదు! ఎప్పుడో 1946లో లార్డ్స్ టెస్టు ఆరంభానికి ముందు మాత్రం భారత జట్టులో అందరు బౌలర్లు కలిపి తీసిన వికెట్లు ఐదు ఉండగా... ఇన్నేళ్లకు ఈ మ్యాచ్‌కు ముందు కొంత మెరుగ్గా మన టాప్–5 కలిపి తీసినవి 11 వికెట్లే! ఆసీస్ తుది జట్టులోని ఆటగాళ్లంతా కలిసి టెస్టుల్లో తీసిన వికెట్లు ఏకంగా 1033! ఇలాంటి ఐదుగురి బృందం ఆస్ట్రేలియాను బెదరగొట్టింది. మధ్యలో కొంత పట్టు చేజారినా... ఈ బౌలింగ్‌కు అనుభవం లేకపోవడం జట్టుకు బలహీనతగా మారుతుందనే మాటను ఏ దశలో కూడా చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు. రెండు టెస్టుల క్రితం అరంగేట్రం చేసిన బౌలర్ ఇప్పుడు తానే బృంద సారథిగా ‘జూనియర్లకు’ సూచనలిస్తూ కనిపించాడు.
వార్నర్‌ను సిరాజ్ అవుట్ చేసిన బంతి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. నటరాజన్ తాను యార్కర్ స్పెషలిస్ట్‌ను మాత్రమే కాదని, తన బౌలింగ్‌లో మరిన్ని అస్త్రాలు ఉన్నాయని నిరూపించగా, శార్దుల్ కూడా తొలి బంతికే వికెట్ తీసి సంబరాల్లో భాగమయ్యాడు. లబ్‌షేన్ క్యాచ్‌ను రహానే పట్టి ఉంటే సైనీ ఖాతాలో కూడా కీలక వికెట్ చేరేది. ఇక సుందర్ అయితే తన సీనియర్ అశ్విన్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా స్మిత్‌ను పడగొట్టాడు. వరుసగా మూడు మెయిడిన్ల తర్వాత ఒక తెలివైన బంతితో స్మిత్‌ను అతను బోల్తా కొట్టించాడు. గత కొన్నేళ్లలో భారత జట్టు చిరస్మరణీయ విజయాల భారం మోసిన స్టార్ పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా, ఉమేశ్ (అశ్విన్ కూడా) లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు టెస్టు ఆడుతుండటమే ఒక విశేషమైతే... ఆసీస్ బ్యాట్స్‌మెన్ తడబడేలా చేసి వారిని నిలువరించిన తీరు అభినందనీయం.
ఇంకా చెప్పాలంటే ఈ బౌలర్ల నేపథ్యాలు కూడా వారిపై గౌరవాన్ని పెంచుతాయి. ఆటోడ్రైవర్ కొడుకు ఒకరు... బస్సు డ్రైవర్ కొడుకు మరొకరు.. తల్లి కూరగాయలు అమ్మగా వచ్చిన మొత్తంతో జీవితాన్ని సాగించింది ఒకరైతే... తన పేద తండ్రి చదువు కోసం సహకరించిన వ్యక్తి పేరును (వాషింగ్టన్) తన పేరుగా పెట్టుకొని కృతజ్ఞత ప్రకటించింది మరొకరు. వీరంతా అంచనాలు, తమపై ఉంచిన నమ్మకానికి మించి మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఈ అవకాశాన్ని వృథా చేయకుండా బ్యాట్స్‌మెన్ కూడా సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు.
నటరాజన్ 300, సుందర్ 301
మెల్‌బోర్న్ టెస్టు తరహాలోనే బ్రిస్బేన్ టెస్టులోనూ భారత్ నుంచి ఇద్దరికి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడిన 300వ ఆటగాడిగా లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్... 301వ ఆటగాడిగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలిచారు. ఇద్దరూ తమిళనాడు ఆటగాళ్లే కావడం విశేషం. నటరాజన్‌కు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్... సుందర్‌కు సీనియర్ బౌలర్ అశ్విన్ క్యాప్‌లు అందజేశారు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో కూడా అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా నటరాజన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడిన 44 రోజుల వ్యవధిలోనే అతను ఈ ఘనతను సాధించడం చెప్పుకోదగ్గ అంశం.
సైనీకి గాయం
భారత జట్టు గాయాల జాబితాలో మరొకరు చేరారు. పేసర్ నవదీప్ సైనీ 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత గజ్జల్లో గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. అతడిని స్కానింగ్ కోసం తీసుకు వెళ్లినట్లు ప్రకటించిన బీసీసీఐ... గాయం తాజా పరిస్థితిపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
మూడు క్యాచ్‌లు నేలపాలు...
కీలకదశలో భారత్ వదిలేసిన మూడు క్యాచ్‌లు ఆసీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా సెంచరీ హీరో లబ్‌షేన్‌కు 37, 48 పరుగుల వద్ద రెండు లైఫ్‌లు వచ్చాయి. మొదటిసారి సైనీ బౌలింగ్‌లో గల్లీలో కెప్టెన్ రహానే సులువైన క్యాచ్ వదిలేయగా... రెండోసారి కొంత కష్టసాధ్యమైన క్యాచ్‌ను పుజారా జారవిడిచాడు. నటరాజన్ బౌలింగ్‌లో ఈ అవకాశం రాగా... పంత్ అత్యుత్సాహంతో మొదటి స్లిప్‌లోకి దూకి అక్కడే ఉన్న పుజారా ఏకాగ్రతను దెబ్బ తీశాడు. ఫలితంగా బంతి పుజారాకు అందలేదు. చివర్లో గ్రీన్ 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు శార్దుల్ తన బౌలింగ్‌లోనే సునాయాసమైన రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. ఆరంభంలోనే లబ్‌షేన్ వెనుదిరిగితే పరిస్థితి ఎలా ఉండేదో!
నాలుగు మార్పులతో...
సిడ్నీ టెస్టులో ఆడిన బుమ్రా, అశ్విన్, జడేజా, విహారి గాయాల కారణంగా భారత తుది జట్టులో తప్పనిసరి మార్పులు చేయాల్సి వచ్చింది. నటరాజన్, సుందర్‌లతో పాటు శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్‌కు మరో అవకాశం దక్కింది. దురదృష్టవశాత్తూ ఈ పర్యటన ఆరంభం నుంచి జట్టుతో ఉంటున్న కుల్దీప్ యాదవ్ మాత్రమే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరుగుతున్న ఏకైక ఆటగాడు కానున్నాడు. రెగ్యులర్ స్పిన్నర్‌గా జట్టులో ప్రాధాన్యతపరంగా అందరికంటే ముందుగానే ఉన్నా... కుల్దీప్‌ను తీసుకుంటే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మరీ బలహీనపడిపోయే అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ సుందర్‌పై నమ్మకముంచింది. రెండేళ్ల క్రితం ఇదే ఆసీస్ పర్యటనలో సిడ్నీ టెస్టులో 5 వికెట్లు తీసి విదేశాల్లో మొదటి ప్రాధాన్యత కుల్దీప్‌కే అంటూ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు పొందిన బౌలర్‌కు ఇప్పటి వరకు మరో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశమే దక్కలేదు!
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్‌షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ శర్మ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బ్యాటింగ్) 28; పైన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (87 ఓవర్లలో 5 వికెట్లకు) 274
వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213.
బౌలింగ్: సిరాజ్ 19–8–51–1, నటరాజన్ 20–2–63–2, శార్దుల్ ఠాకూర్ 18–5–67–1, నవదీప్ సైనీ 7.5–2–21–0, వాషింగ్టన్ సుందర్ 22–4–63–1, రోహిత్ శర్మ 0.1–0–1–0.
–సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment