పకోవ్‌స్కీ; పకోవ్‌స్కీ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడుస్తున్న రిషభ్ పంత్
వర్షం...విల్ పకోవ్‌స్కీ... వికెట్ కీపర్ వైఫల్యం...సంక్షిప్తంగా సిడ్నీ టెస్టు తొలి రోజు ఆట ఇది! గత రెండు టెస్టులకు భిన్నంగా ఆస్ట్రేలియా ఈ సారి కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడగా... మన బౌలింగ్ వైఫల్యం, పంత్ క్యాచ్‌లు వదిలేయడం వెరసి ప్రత్యర్థిదే పైచేయిగా మారింది. వాన కారణంగా 55 ఓవర్లకే పరిమితమైన ఆటను రెండు అర్ధ సెంచరీలు ప్లస్ ఒక శతక భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టు సంతృప్తిగా ముగించింది. ఇదే జోరుతో రెండో రోజు ఆ జట్టు భారీ స్కోరుపై దృష్టి పెట్టింది. అన్నింటికి మించి సొంత మైదానంలో స్మిత్ ఫామ్‌లోకి రావడం ఇప్పుడు భారత్‌ను కాస్త ఆందోళన పెట్టే అంశం.
సిడ్నీ: మూడో టెస్టులో కూడా భారత్‌కు శుభారంభం దక్కినా... రెండు క్యాచ్‌లు నేలపాలు కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పుంజుకునేందుకు అవకాశం దక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు), మార్నస్ లబ్‌షేన్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న లబ్‌షేన్, స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు) కలిసి మూడో వికెట్‌కు అభేద్యంగా 60 పరుగులు జోడించారు.
వార్నర్ విఫలం
గాయంనుంచి కోలుకున్న వార్నర్‌ను ఆడించడం ద్వారా ప్రత్యర్థిపై అదనపు ఒత్తిడిని పెంచాలనుకున్న వ్యూహం ఆసీస్‌కు బెడిసికొట్టింది. టెస్టు ఆడే స్థాయి ఫిట్‌నెస్ లేకపోయినా బరిలోకి దిగిన డాషింగ్ బ్యాట్స్‌మన్ వార్నర్ (5)ను సిరాజ్ తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్ 4వ) పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్‌పై నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నేరుగా స్లిప్‌లో ఉన్న పుజారా చేతుల్లో పడింది. తర్వాత లబ్‌షేన్ వచ్చాడు. ఆ వెంటే వాన కూడా వచ్చింది. విరామం తర్వాత తిరిగి మొదలైన ఆట ఆస్ట్రేలియాకే అనుకూలంగా సాగింది. ఇటు లబ్‌షేన్ కుదురుగా ఆడుతుండగా... అటు పంత్ పుణ్యమా అని రెండు లైఫ్‌లు పొందిన ఓపెనర్ పకోవ్‌స్కీ అర్ధ సెంచరీతో రాణించాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఎట్టకేలకు పకోవ్‌స్కీని సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
లబ్‌షేన్ అర్ధసెంచరీ
స్టీవ్ స్మిత్ వచ్చాక ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. గత మ్యాచ్‌ల వైఫల్యాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతను పట్టుదలగా ఆడాడు. భారత బౌలర్లు సంధించిన వైవిధ్యమైన బంతులను చక్కగానే ఆకళింపు చేసుకొని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో తడబాటును అధిగమించి క్రీజులో పాతుకుపోయాడు. లబ్‌షేన్ కూడా స్మిత్ అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి సెషన్‌లో ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ రహానే చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. లబ్‌షేన్ కూడా ఫోర్లతో అదరగొట్టాడు. ఆట నిలిచే సమయానికి వీరిద్దరు అభేధ్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు.
వానొచ్చే... ఆట ఆగే!
మ్యాచ్ టైమ్‌కే మొదలైంది కానీ... కాసేపటికే ముసిరిన వానతో టైమ్ అంతా గడిచిపోయింది. షెడ్యూలు ప్రకారం ఉదయం 10.30 గంటలకు (స్థానిక కాలమానం) ఆట ఆరంభమైంది. ఇంకేం ఆటకు ఢోకా లేదనుకునేంత లోపే పిడుగులా వచ్చి పడింది వాన. ఎనిమిదో ఓవర్లో కురిసిన వాన తొలి సెషన్‌పై నీళ్లు చల్లింది. తెరిపినివ్వలేకపోవడంతో ఆ వానలోనే లంచ్‌బ్రేక్ ముగిసింది. ఇక రెండో సెషన్‌ను అయినా వరుణుడు కరుణిస్తాడేమో అనుకుంటే అంత తేలిగ్గా చినుకులు ఆగలేదు. ఆట మొదలవలేదు. చాలాసేపటికి తెరిపినివ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం) పునఃప్రారంభమైంది. ఓ విధంగా చెప్పాలంటే ఉదయం 11.05 నిమిషాలకు మొదలైన 8వ ఓవర్ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు ముగిసిందన్నమాట. మళ్లీ సరిగ్గా టీ బ్రేక్ సమయంలో చినుకులు కురిసినా నిమిషాల వ్యవధిలోనే ఆగడంతో ఆట కోసం మళ్లీ నిరీక్షించాల్సిన పని లేకపోయింది.
పంత్ పదేపదే...
వృద్ధిమాన్ సాహా టెస్టుల్లో మంచి వికెట్ కీపర్. సంప్రదాయ ఫార్మాట్‌లో వికెట్ల వెనుక అతని చురుకుదనం అందరికీ తెలుసు. అయితే బ్యాటింగ్‌లో సాహాకంటే మెరుగంటూ పంత్‌కు తుది జట్టులో చోటు లభిస్తోంది. బలమైన ప్రత్యర్థి, కీలకమైన మ్యాచ్‌లో అప్రమత్తంగా ఉండాల్సిన రిషభ్ పంత్ మూడు ఓవర్ల వ్యవధిలోనే రెండు క్యాచ్‌ల్ని చేజార్చడం తొలి రోజు భారత్‌కు సమస్యగా మారింది. 22వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా... పకోవ్‌స్కీ 26 పరుగుల వద్దే ఉన్నాడు. మెలికలు తిరిగిన ఆఖరి బంతి అతని బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచింది. సునాయాసమైన ఈ క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు. దీంతో అశ్విన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మళ్లీ 25వ ఓవర్ సిరాజ్ వేయగా.. పకోవ్‌స్కీ గ్లౌజ్‌ను తాకుతూ వెళ్లిన బంతిని క్యాచ్ అందుకునేందుకు రెండు సార్లు డైవ్‌చేసి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికీ అతని స్కోరు 32 పరుగులే!.. ఇలా లైఫ్ పొందిన పకోవ్‌స్కీ ఎట్టకేలకు అర్ధసెంచరీ పూర్తి చేసుకుని అరంగేట్రంలో మెరుగైన ప్రదర్శన కనబరిచి అందరి చేతా అభినందనలు అందుకుంటున్నాడు. నవదీప్ సైనీ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
► భారత్ తరఫున టెస్టుల్లో ఆడిన 299వ ఆటగాడిగా నవదీప్ సైనీ నిలిచాడు. పేసర్ బుమ్రా చేతుల మీదుగా అతను ‘టెస్టు క్యాప్’ను అందుకున్నాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్‌స్కీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్‌షేన్ బ్యాటింగ్ 67; స్మిత్ బ్యాటింగ్ 31; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–6, 2–106.
బౌలింగ్: బుమ్రా 14–3–30–0, సిరాజ్ 14–3–46–1, అశ్విన్17–1–56–0, నవ్‌దీప్ సైనీ 7–0–32–1, జడేజా 3–2–2–0.
Comments
Please login to add a commentAdd a comment