
పెర్త్: ప్రపంచకప్ గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ఆ స్ట్రేలియా, పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల లోనూ తడబడుతున్న పాకిస్తాన్ మధ్య టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై తిరుగులేని జట్టయిన ఆసీస్ అన్ని రకాలుగా బలంగా కనిపిస్తూ నిస్సందేహంగా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత జట్టు, కెప్టెన్‌ల మార్పులతో పాక్ బరిలోకి దిగుతోంది.
1995లో ఆసీస్ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. 1999 టూర్‌నుంచి ఆ జట్టు వరుసగా 14 టెస్టుల్లో ఓడింది. కనీసం ‘డ్రా’గా కూడా ముగించలేకపోయింది. టెస్టుకు ముందు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖాజా గాజాలో పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన షూస్‌కు ‘ఆల్ లైవ్స్ ఆర్ ఈక్వల్’ అనే క్యాప్షన్‌తో ప్రాక్టీస్‌తో పాల్గొన్నాడు.
అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి క్రికెట్ మైదానంలో ప్రదర్శించరాదు. ఖాజాకు తన భావాలను ప్రదర్శించే స్వేచ్ఛ ఉందని ఆసీస్ బోర్డు, కెప్టెన్ కమిన్స్ అండగా నిలిచినా... అతను ఆ వ్యాఖ్యలు ఉన్న షూస్‌తో టెస్టు బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నాడు. తనది రాజకీయ ప్రకటన కాదని, మానవత్వం మాత్రమేనని ఖాజా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment