సెయింట్ లూసియా: వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వాయిదా పడింది. అయితే ఈ మ్యాచ్ టాస్ వేశాక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఆసీస్, విండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌కు కూడా వెళ్లారు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించాడు. అనంతరం విశ్లేషకుడు డారెన్ గంగా పిచ్ రిపోర్టు కూడా చెప్పాడు. ఆసీస్ ఓపెనర్లు బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు.
ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. ఆటగాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరిగిందా అని ఆరా తీయగా వెస్టిండీస్ జట్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రెండు జట్లలోని ఆటగాళ్లకు మరోసారి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఈ మ్యాచ్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బయో బబుల్‌లో ఉన్న ఇరు జట్లను ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆటగాళ్లకు సంబంధించిన తాజా కోవిడ్ రిపోర్టులు వెల్లడి కావాల్సి ఉండటంతో రేపటి మూడో వన్డే సైతం వాయిదా పడినట్టేనని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment