
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021-23)లో భాగంగా వచ్చే ఏడాది భారత పర్యటనకు ఆస్ట్రేలియా రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆసీస్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మార్చి 3న న్యూఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా, భారత్ జట్లు అర్హత సాధించే అవకాశాలు ఈ సిరీస్‌పై ఆధారపడి ఉంటాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయిట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. అదే విధంగా భారత పర్యటనను ముగించుకున్న తర్వాత ఆస్ట్రేలియ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడనుంది. "డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత్ జట్లకు చాలా కీలకం. ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
భారత్-ఆసీస్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో జరిగినా, భారత్‌లో జరిగినా పోటీ మాత్రం తప్పదు. రెండు జట్ల మధ్య పోటీ ప్రతీ ఏటా మరింత పెరుగుతోంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు. అదే విదంగా ఆసీస్ ఆటగాళ్లు మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్‌లపై పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "లాబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. శ్రీలంకపై వీరిద్దరూ సెంచరీలతో చెలరేగారు. భారత పర్యటనలో కూడా ఆసీస్ జట్టుకు వీరిద్దరూ కీలకం కానున్నారు" అని పాంటింగ్ తెలిపాడు.
చదవండి: Updated WTC Points Table: పాకిస్తాన్‌కు శ్రీలంక షాక్.. టీమిండియా తర్వాతి స్థానంలో బాబర్ ఆజం బృందం!