ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే!
క్రికెట్ మ్యాచ్ ఏదైనా.. ముఖ్యంగా వన్డే లేదంటే టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే సందర్భాల్లో.. ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడితే.. ప్రేక్షకులకు మాత్రం పరిమిత ఓవర్ల మ్యాచ్‌లోని అసలైన మజా అనుభవించే అవకాశం దొరుకుతుంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో ఇలాంటి అనుభవాలు చవిచూసింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో 3 పరుగులు, రెండో వన్డేలో ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ సిక్సర్ కొట్టడంతో 2 వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇక భారత బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కెరీర్‌లోనే ఇది చిరస్మరణీయ మ్యాచ్ అనడంలో సందేహం లేదు.
విజయానంతరం అతడు మాట్లాడుతూ.. అద్భుత ఇన్నింగ్స్‌తో అది కూడా సిక్సర్‌తో ముగించి జట్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం తనకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని చెప్పాడు. మరి, అక్షర్ లాగే ఫైనల్ ఓవర్లో సిక్స్‌తో ఫినిషింగ్ ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చిన టీమిండియా క్రికెటర్లు ఎవరో ఓసారి గమనిద్దాం.
అక్షర్ పటేల్
వెస్టిండీస్ పర్యటన-2022లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో అక్షర్ పటేల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రెండో వన్డేలో భారత్ విజయానికి ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు అవసరమైన వేళ.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి.
.@akshar2026 takes #TeamIndia home! Finishes it in style.
— FanCode (@FanCode) July 24, 2022
Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/WHjdscpzd9
ఈ క్రమంలో విండీస్ బౌలర్ మేయర్స్ నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా సంధించగా.. అక్షర్ దానిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. అదే విధంగా అంతకు ముందు మొదటి మ్యాచ్‌ల కూడా గెలవడంతో సిరీస్ కూడా సొంతమైంది.
ఎంఎస్ ధోని
టీమిండియా అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అతడి బెస్ట్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ అనగానే వన్డే వరల్డ్‌కప్-2011 గుర్తుకురావడం సహజం. ఫైనల్లో శ్రీలంక ఆటగాడు కులశేఖర బౌలింగ్‌లో 49వ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ సిక్స్ భారత్‌కు ప్రపంచకప్‌ను అందించింది.
ఇదిలా ఉంటే.. ఆఖరి ఓవర్లో ధోని సిక్స్ బాది టీమిండియాను గెలిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. 2013లో వెస్టిండీస్ వేదికగా విండీస్, శ్రీలంక, టీమిండియా మధ్య వన్డే ట్రై సిరీస్ జరిగింది. ఇందులో బాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి.
అప్పటికి ధోని క్రీజులో ఉన్నాడు. షమిందా ఎరంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటిది డాట్ బాల్.. దీంతో ఐదు బంతుల్లో 15 పరుగులు సాధించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తదుపరి మూడు బంతుల్లో ధోని వరుసగా సిక్సర్, ఫోర్, సిక్సర్ బాదాడు. విజయం టీమిండియా సొంతమైంది.
దినేశ్ కార్తిక్
2018 నిదహాస్ టీ20 ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. ఈ ట్రై సిరీస్‌లో బంగ్లాదేశ్- టీమిండియా మధ్య ట్రోఫీకై హోరాహోరీ పోరు జరిగింది. టైటిల్ గెలవాలంటే ఆఖరి రెండు ఓవర్లలో భారత్‌కు 34 పరుగులు కావాలి.
విజయ్ శంకర్, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు. గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకున్న డీకే.. 19వ ఓవర్‌లో 22 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం ఆరు బంతుల్లో 12 పరుగులుగా మారింది. అయితే, స్ట్రైక్ రొటేట్ చేస్తున్న వేళ విజయ్ తడబడటంతో ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితి. నరాలు తెగే ఉత్కంఠ. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి డీకే భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.
హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన శైలిలో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వేదికగా 2020లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్.. ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించి భారత్‌కు భారీ లక్ష్యం విధించింది.
16.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 149 పరుగులు చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయింది. 23 బంతుల్లో 56 పరుగులు చేయాలి. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఆఖరి ఓవర్లో టీమిండియా గెలుపు సమీకరణం 14 పరుగులు.. డేనియల్ సామ్స్ బౌలింగ్. పాండ్యా క్రీజులో ఉన్నాడు. మొదటి మూడు బంతుల్లో స్కోరు వరుసగా 2,6, డాట్.
దీంతో మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. పాండ్యా తనదైన శైలిలో భారీ షాట్ బాది టీమిండియాకు విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతుల్లో 42 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
హర్భజన్ సింగ్
టర్బోనేటర్, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ భజ్జీ.. పాకిస్తాన్‌తో 2010 నాటి మ్యాచ్‌లో బ్యాటర్‌గా తన విశ్వరూపం ప్రదర్శించాడు. డంబుల్లా వేదికగా జరిగిన ఆసియా కప్ ఈవెంట్‌లో భాగంగా దాయాది జట్టుతో పోరు. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్ సల్మాన్ భట్ 74 పరుగులతో రాణించాడు. కమ్రాన్ అక్మల్ 51 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ 267 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఓపెనర్ గౌతమ్ గంభీర్ 83, కెప్టెన్ ధోని 56 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిపారు.
అయితే, ఆ తర్వాత సీన్ మారింది. వరుస విరామాల్లో భారత్ వికెట్లు కోల్పోయింది. 46వ ఓవర్.. భారత్ స్కోరు 219. చేతిలో నాలుగు వికెట్లు. మహ్మద్ ఆమిర్ చేతికి బంతినిచ్చాడు పాక్ సారథి ఆఫ్రిది.
భారత్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాలి. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ క్రీజులో ఉన్నారు. రెండో బంతికి రైనా అవుటయ్యాడు. ఈ క్రమంలో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులకు చేరింది. భజ్జీకి షార్ట్ లెంగ్త్ బాల్ సంధించాడు ఆమిర్. ఏమాత్రం తడబడకుండా దాన్ని బౌండరీకి తరలించి జట్టును గెలిపించాడు టర్బోనేటర్.
ఇర్ఫాన్ పఠాన్
2007 ఫిబ్రవరి.. శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్. నాలుగు వికెట్ల నష్టానికి లంక జట్టు 171 పరుగులు చేసింది. భారత్‌కు శుభారంభం లభించలేదు. ఆదుకుంటారనుకున్న సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ కూడా 30 పరుగులకే పెవిలియన్ చేరారు. 15.1 ఓవర్లలో స్కోరు 115/7. గెలవాలంటే 29 బంతుల్లో 56 పరుగులు చేయాలి. యూసఫ్ పఠాన్, అతడి తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో ఉన్నారు.
యూసఫ్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఇర్ఫాన్ కూడా అన్నకు జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతూనే పరుగులు రాబడుతూ భారత శిబిరంలో ఉత్సాహం నింపారు.
ఈ క్రమంలో గెలుపు సమీకరణం ఆఖరి ఓవర్లో ఐదు పరుగులకు చేరింది. లసిత్ మలింగ బరిలోకి దిగాడు. మొదటి బంతికి యూసఫ్ సింగిల్ తీశాడు. రెండో బంతిని ఎదుర్కొన్న ఇర్ఫాన్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది భారత్ విజయం ఖరారు చేశాడు.
చదవండి: Commonwealth Games 2022: భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్!
Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా!
Comments
Please login to add a commentAdd a comment