సెంచూరియన్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. అంతకముందు కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. హషీమ్ ఆమ్లాకు 83 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా బాబర్ అజమ్ మాత్రం 13 వన్డే సెంచరీలు చేయడానికి 76 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకొని కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబుచులాడిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు సాధించింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డస్సెన్ అజేయ శతకం (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో ఆదుకున్నాడు. అతడు మిల్లర్ (50; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఇక 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ సరిగ్గా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి కేవలం మూడు పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లున్నాయి.
ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్ ఖాన్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్)ను అవుట్ చేశాడు. తర్వాతి మూడు బంతులకు ఫెలుక్వాయో ఒక్క పరుగూ ఇవ్వలేదు. దాంతో పాక్ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. అయితే ఫాహిమ్ అష్రఫ్ (5 నాటౌట్) ఐదో బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక పరుగు సాధించి పాకిస్తాన్‌ను గట్టెక్కించాడు.
చదవండి:
'కెప్టెన్సీ.. పంత్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం'
Comments
Please login to add a commentAdd a comment