
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన ఆ సలహా వల్లే తన బ్యాటింగ్ ఈ స్థాయికి చేరిందని ప్రశంసలతో ముంచెత్తాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేయాలని కోహ్లి ఇచ్చిన సలహాతో తన ఆట చాలా మెరుగుపడిందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న ఆజమ్.. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా 103, 31, 94 పరుగులతో రాణించిన ఆజమ్.. ఆ సిరీస్‌లో 13 పాయింట్లు సాధించి, పాక్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్‌తో జరిగిన చిట్‌చాట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిట్ చాట్ సందర్భంగా కోహ్లి ఇచ్చిన సలహాను ఆజమ్ గుర్తు చేసుకున్నాడు. గతంలో నేను నెట్ ప్రాక్టీస్‌ను చాలా తేలికగా తీసుకునేవాడినని, ఆ తర్వాత కోహ్లి సలహా మేరకు ఆ అలవాటును మార్చుకున్నాని పేర్కొన్నాడు.
నెట్ సెషన్స్ ఎంత ముఖ్యమో ఆ తరువాతే అర్థం చేసుకున్నానని, అక్కడ కష్టపడితేనే మైదానంలో సత్తా చాటగలమని గ్రహించానని వెల్లడించాడు. నెట్స్‌లో నిర్లక్ష్యపు షాట్లు ఆడకూడదని, నెట్ సెషన్స్‌ను కూడా మ్యాచ్‌లానే భావించాలని కోహ్లీ సూచించాడని తెలిపాడు. నెట్స్‌లో మన ప్రవర్తన ఎలా ఉంటే మ్యాచ్‌లో కూడా అలానే ఉంటుందని కోహ్లి చెప్పిన విషయాన్ని ఆజమ్ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment