
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో తమ జోరును కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్‌ల్లో భారత చేతిలో దారుణ ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అయితే ఏకంగా 434 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది.
టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వెన్ను గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బౌలింగ్‌కు దూరంగా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మూడో టెస్టు అనంతరం స్టోక్సీ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ ఈఎస్పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫోకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మీరు బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నారా అన్న ప్రశ్న ఇంగ్లీష్ కెప్టెన్‌కు ఎదురైంది.
అందుకు బదులుగా.. "నేను కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేను. అలా అని చేయని కూడా చెప్పలేను. నేను బౌలింగ్ చేయాలా వద్దా అన్న విషయం కోసం మా వైద్య బృందంతో ఇంకా చర్చిస్తున్నాను. కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో అయితే నేను 100కు 100 శాతం బౌలింగ్ చేయగల్గుతున్నాను.
ఆ సమయంలో నాకు ఎటువంటి సమస్యలేదు. త్వరలో తిరిగి మళ్లీ బౌలింగ్ చేయగలనని" ఆశిస్తున్నానని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: Ranchi Test: టీమిండియాకు బిగ్ షాక్.. డబుల్ సెంచరీల వీరుడు దూరం!?