‘బజ్‌బాల్‌’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!.. | Why England's 'Bazball' fell flat in India? | Sakshi
Sakshi News home page

IND vs ENG:‘బజ్‌బాల్‌’ బెడిసికొట్టి, అవమానభారంతో ఇలా!..

Mar 11 2024 11:57 AM | Updated on Mar 11 2024 1:13 PM

Why England Bazball fell flat in India - Sakshi

భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్‌ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్‌ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్‌ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్‌బాల్‌ అంటూ వరల్డ్‌ క్లాస్‌ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్‌.. భారత్‌ దెబ్బకు పసికూనలా వణకిపోయింది.

అసలైన టెస్టు క్రికెట్‌ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌ జట్టుకు రోహిత్‌ సేన చూపించింది. ఘన విజయంతో భారత్‌ టూర్‌ను ముగించాలని భావించిన స్టోక్స్‌ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్‌ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం.

బెడిసి కొట్టిన బజ్‌ బాల్‌..
ఇంగ్లండ్‌ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్‌ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్‌బాల్‌ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్‌ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్‌ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్‌ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్‌ జో రూట్‌ సైతం అదే తీరును కనబరిచాడు.

పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్‌కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్‌ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్‌లో భారత 9వ నెంబర్‌ ఆటగాడు కుల్దీప్‌ యాదవ్‌ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్‌ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు.

టెస్టు క్రికెట్‌ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్‌ చేయాలనే కామన్‌ సెన్స్‌ ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కొరవడింది. బజ్‌బాల్‌ అంటూ టెస్టు క్రికెట్‌ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్‌కు భారత్‌ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌
ఇంగ్లండ్‌ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్‌ కాన్ఫిడెన్స్‌. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్‌.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్‌ వైట్‌ వాష్‌ చేసినట్లు బిల్డప్‌ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్‌ అన్న విషయం బహుశా ఇంగ్లండ్‌ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్‌ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్‌ పంజా విసిరింది.

ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్‌ ఓవర్‌ ‍కాన్ఫిడెన్స్‌ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్‌ టెస్టు అనంతరం భారత్‌ నుంచి దుబాయ్‌ వేకేషన్‌కు ఇంగ్లండ్‌ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్‌ ఆటను మర్చిపోయి ఎంజాయ్‌ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది.

ఆ తర్వాత రాజ్‌కోట్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్‌కోట్‌లో కూడా ఇంగ్లండ్‌ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్‌ మాత్రం సిరీస్‌ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్సీ, కోచ్‌ మెకల్లమ్‌ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్‌ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్‌ ముందు ఇంగ్లండ్‌ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్‌ విజయ భేరి మ్రోగించింది.

బౌలింగ్‌ వైఫల్యం.
స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్‌ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్‌ ఆండర్సన్‌, వుడ్‌ వంటి వరల్డ్‌ క్లాస్‌ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్‌ను అయితే భారత యువ ఓపెనర్‌ జైశ్వాల్‌ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే.

ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో ఎటాక్‌లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్‌ లీచ్‌ వంటి స్టార్‌ స్పిన్నర్‌ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్‌ను బాగా దెబ్బతీసింది. టామ్‌ హార్లీ, బషీర్‌ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు.

స్టోక్సీ మిస్‌ ఫైర్‌..
తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్‌ స్టోక్స్‌.. భారత్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.  ఈ సిరీస్‌లో బెన్‌ స్టోక్స్‌ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్‌లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్‌ అయ్యాడు. సిరీస్‌ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్‌ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్‌ ఓటమికి ఓ కారణం.

కుర్రాళ్లు కొట్టిపాడేశారు..?
కోహ్లి, రాహుల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్‌ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్‌ మేనెజ్‌మెంట్‌ భావించింది. కోహ్లిని ఎలా ఔట్‌ చేయాలి? రాహుల్‌ను ఎలా ఔట్‌ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్‌.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్‌, సర్ఫరాజ్‌, ధ్రవ్‌ జురల్‌ యువ సంచలనాలు ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్‌ అయితే ఏకంగా రెండు డబుల్‌ సెంచరీలు బాదేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement