అనుకున్నదే జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టులో (రెండో టెస్ట్ తర్వాత) మరో వికెట్ పడింది. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కాలి చీలిమండ గాయం కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా హాజిల్‌వుడ్ బాటలోనే ఇంటిదారి పట్టాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ (తొలి రోజు) సందర్భంగా మహ్మద్ సిరాజ్ సంధించిన ఓ బంతి వార్నర్ మోచేతిని బలంగా తాకడంతో అతని ఎడమ మోచేయి ఫ్రాక్చర్‌కు గురైనట్లు ఆసీస్ మేనేజ్‌మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 21) ప్రకటించింది.
ఈ కారణంగా వార్నర్.. భారత్‌తో జరిగే మూడు, నాలుగు టెస్ట్‌లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది. వార్నర్ స్కాన్ రిపోర్ట్స్‌లో వెంట్రుకవాసి అంత ఫ్రాక్చర్‌ను గుర్తించినట్లు వివరించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని హాజిల్‌వుడ్‌తో పాటు వార్నర్ కూడా సిడ్నీకి బయల్దేరతాడని పేర్కొంది. భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు (మార్చి 17 నాటికి) వార్నర్ జట్టుతో తిరిగి చేరతాడని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా గాయపడిన వార్నర్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అతని స్థానంలో కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్ రెన్‌షా బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్‌లో ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో (1, 10, 15) దారుణంగా విఫలమైన 36 ఏళ్ల వార్నర్ జట్టుకు భారంగా మారాడు.
ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇదివరకే స్వదేశానికి పయనమయ్యాడు. అతను తిరిగి వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు మూడో టెస్ట్‌కు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌ల సన్నద్దతపై కూడా సందిగ్ధత నెలకొంది. హాజిల్‌వుడ్, వార్నర్‌లకు రీప్లేస్‌మెంట్‌గా ఎవరినైనా భారత్‌కు పిలిపించుకుంటారా లేదా అన్న అంశంపై కూడా ఆసీస్ మేనేజ్‌మెంట్ నోరు మెదపడం లేదు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలై ఢీలా పడిపోయిన ఆసీస్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తదుపరి సిరీస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment