టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిరీస్ మొదలయ్యేనాటికి అతడు అందుబాటులోకి వచ్చినా బౌలింగ్ చేసే అవకాశం మాత్రం లేదని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నర్ వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.
ఫైనల్‌కు చేరే దారిలో
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు చేరుకునే టీమిండియా- ఆస్ట్రేలియా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్యాట్ కమిన్స్ బృందం రెండోస్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరులో టెస్టు సిరీస్ మొదలుకానుంది.
ఇందులో భాగంగా నవంబరు 22- జనవరి 7 వరకు ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతున్న వేళ.. సొంతగడ్డపై సత్తా చాటాలని కంగారూ జట్టు పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు ముందు కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్‌లేమి రూపంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.
గ్రీన్‌కు వెన్నునొప్పి
ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేల సందర్భంగా గ్రీన్‌కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో సిరీస్ మొత్తానికి అతడు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నా.. టీమిండియాతో సిరీస్‌లో మాత్రం బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి ఆసీస్ టీమ్ డాక్టర్ పీటర్ బ్రుక్నర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గ్రీన్ వెన్నునొప్పి కాస్త తగ్గిందనే చెబుతున్నాడు.
బౌలింగ్ చేస్తే మొదటికే మోసం
అయితే, ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా గాయం తీవ్రత ఎలా ఉందో అంచనా వేస్తాం. వెన్నుపై ఒత్తిడి ఎక్కువైతే కచ్చితంగా మళ్లీ నొప్పి తిరగబెడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది.
అయితే, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం వల్ల పెద్దగా ప్రభావం పడకపోవచ్చు’’ అని తెలిపాడు. కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్రీన్ సేవల్ని గనుక ఆసీస్ కోల్పోతే.. స్టార్ బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment