![Boxer Saritha Devi Tested Negative Of Coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/9/SD.jpg.webp?itok=zyYAvaaa)
న్యూఢిల్లీ: ప్రపంచ, ఆసియా మాజీ చాంపియన్, భారత మేటి బాక్సర్ లైష్రామ్ సరితా దేవి కోవిడ్–19 నుంచి బయట పడింది. తాజా పరీక్షలో తనకు నెగెటివ్ ఫలితం వచ్చినట్లు ఆమె వెల్లడించింది. అయితే ఏడేళ్ల తన కుమారుని ఆరోగ్య భద్రత దృష్ట్యా మరో 10 రోజుల పాటు ఇంటికి దూరంగా క్వారంటైన్‌లో ఉండనున్నట్లు పేర్కొంది. 38 ఏళ్ల సరితా దేవి, ఆమె భర్త తోయిబా సింగ్ ఆగస్టు 17న కరోనా పాజిటివ్‌గా తేలారు. చికిత్స అనంతరం సోమవారం కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయినట్లు ఆమె తెలిపింది.
‘నాకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా బయటపడ్డాయి. కాస్త జలుబు చేసింది అంతే. అయితే నెగెటివ్‌గా తేలడంతో ఆసుపత్రి నుంచి సోమవారమే బయటకొచ్చా. కానీ మరికొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి ఉంటే నా ఏడేళ్ల కుమారుడు వెంటనే వచ్చి నన్ను హత్తుకుని ఉండేవాడు. అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం మాకిష్టం లేదు. అందుకే నా అకాడమీలోని హాస్టల్ గదిలో మరో పది రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తా’ అని సరితా వివరించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకో సింగ్ తర్వాత వైరస్ బారిన పడిన రెండో బాక్సర్ సరిత కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment