మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత్ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 200 ఆలౌట్ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 ప్రతిఘటనతో భారత్ గెలుపు ఆలస్యమైంది. సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. లంచ్ విరామం అనంతరం టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు.
సిరాజ్‌కు రెండు
133/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 23 పరుగులు జత చేసిన అనంతరం కమిన్స్ (103 బంతుల్లో 22; 1x4) వికెట్ కోల్పోయింది. బుమ్రా విసిరిన బంతి కమిన్స్ గ్లోవ్స్‌ను తాకి సెకండ్ స్లిప్‌లో ఉన్న అగర్వాల్ చేతిలో పడింది. ఇక ఎనిమిదో వికెట్‌గా క్రీజులోకొచ్చిన స్టార్క్ సహకారంతో గ్రీన్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. బుమ్రా వేసిన 90 ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు. అర్ధ సెంచరీకి చేరువవుతున్న గ్రీన్ (146 బంతుల్లో 45; 5x4)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. అప్పటికీ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులు. చివర్లో లైయన్‌ను సిరాజ్, హేజిల్‌వుడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఆతిథ్య జట్టు 200 పరుగులకు ఆలౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment