![BPL 2023: Tamim Iqbal, Shai Hope Blasts With 90s Vs Comilla Victorians - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/31/Untitled-11.jpg.webp?itok=_SfKh1xY)
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు.
అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment