ఢాకా: బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తమీమ్ ఇక్బాల్.. తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ఢాకా డైనమేట్స్‌తో జరిగిన తుది పోరులో ఇక్బాల్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 11 సిక్సర్లు, 10 ఫోర్లు సాయంతో అజేయంగా 141 పరుగులు సాధించాడు. దాంతో కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
టాస్ గెలిచిన ఢాకా డైనమేట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత అనముల్ హక్‌తో కలిసి ఇక్బాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్ 89 పరుగులు జోడించిన తర్వాత అనముల్(24) ఔటయ్యాడు. ఆపై వెంటనే షమ్‌సూర్ రెహ్మాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న ఇక్బాల్ తన దూకుడుగా మరింత పెంచాడు. క్రీజ్‌లో పాతుకుపోయి ఆకాశమేహద్దుగా విజృంభించాడు. ఈ క్రమంలోనే 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఆటను కడవరకూ కొనసాగించడంతో కొమిల్లా 200 లక్ష్యాన్ని ఢాకా డైనమేట్స్ ముందుంచింది.
లక్ష్య ఛేదనలో ఢాకా పరుగుల ఖాతా తెరవకుండానే సునీల్ నరైన్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో ఉపుల్ తరంగా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు,, 3సిక్సర్లు)-రోనీ తలుక్దర్(66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ఢాకా విజయం దిశగా పరుగులు తీసింది.కాగా, ఉపుల్ తరంగా రెండో వికెట్‌గా ఔటైన తర్వాత ఢాకా స్కోరులో వేగం తగ్గింది. రోనికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఢాకా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫలితంగా కొమిల్లా 17 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. కొమిల్లా బౌలర్లలోవహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సైఫుద్దీన్, తిషారా పెరీరాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇది కొమిల్లా విక్టోరియన్స్‌కు రెండో టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment