T20 WC 2024- Rishabh Pant: రిషభ్ పంత్ టీమిండియా పునరాగమనం గురించి భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ జట్టులోకి తిరిగి వచ్చినా.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం కష్టమన్నాడు.
కాగా డిసెంబరు 30, 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ వికెట్ కీపర్.. ఫిట్‌నెస్ సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత అంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే బీసీసీఐ సెలక్టర్లు.. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టును ఎంపిక చేయనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై బోర్డు ఇప్పటికీ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇషాన్ కిషన్‌కు బీసీసీతో విభేదాలు తలెత్తాయన్న తరుణంలో.. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు.
ఈ క్రమంలో జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లకు స్వదేశంలో జరిగిన ఈ టీ20 సిరీస్ ఆడే అవకాశం దక్కింది. అయితే, పంత్ తిరిగి వస్తే వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. టీ20 జట్టులో పంత్ పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘రిషభ్ పంత్ జీవితంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ఆటగాడిగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అంత సులువేమీ కాదు. పంత్ తిరిగి మైదానంలో అడుగుపెడితే అందరికీ సంతోషమే.
కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా చేరుకున్నాడు. అయితే, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడమే అన్నికంటే ముఖ్యం. ఆతర్వాత రెగ్యులర్‌గా క్రికెట్ ఆడాలి. ఆటలో మునుపటి లయను అందుకోవాలి.
దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం అది కూడా అంతటి ఘోర ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకుని తిరిగి రావడం అంటే కష్టంతో కూడుకున్న పనే.. ఇవన్నీ ఆలోచిస్తే గనుక.. పంత్ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడినా.. సెలక్టర్లు అతడిని టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆడించే రిస్క్ చేస్తారని అనుకోవడం లేదు’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో..
Comments
Please login to add a commentAdd a comment