పుష్కరకాలం తర్వాత భారత్ ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. టీమిండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా ట్రోఫీ కోసం పడనున్నాయి.
ఇక ఐసీసీ టోర్నమెంట్‌లో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వదేశంలో ఈవెంట్ జరగడం సానుకూలంగా పరిగణిస్తున్న తరుణంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇదే అంశం టీమిండియాకు ప్రతికూలంగానూ మారే అవకాశం ఉందంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం.
‘‘టీమిండియాలో గొప్ప ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, స్వదేశంలో ఆడటం ఒక్కోసారి మైనస్ అవుతుంది కూడా! 2011లో భారత్ ట్రోఫీ గెలిచింది. అందుకే ఈసారి సొంతగడ్డపై టోర్నీ జరగడం.. జట్టుపై మరింత ఒత్తిడి పెంచుతుంది.
కేవలం టీమిండియా విషయంలో మాత్రమే కాదు.. ఒకవేళ పాకిస్తాన్‌లో ఈవెంట్ జరిగినా పాక్ జట్టు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రయోజనాలతో పాటు ఇలాంటి కొన్ని ‘నష్టాలు’ కూడా ఉంటాయి. సొంత ప్రేక్షకుల నడుమ భారీ అంచనాల నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడిలో ఆడటం అంత తేలికేమీ కాదు’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.
ఇక భారత జట్టులో అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నారన్న ఈ మాజీ పేసర్.. ‘‘టీమిండియాలో మహ్మద్ షమీ.. అతడి బౌలింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. అయితే, బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ అతడు అన్ని రకాలుగా మ్యాచ్‌లకు సన్నద్ధంగా ఉంటే.. అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు.
పేస్ విభాగం పటిష్టమవుతుంది. ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్.. వీరిద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే, ఇద్దరూ వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హులే’’ అని రేడియో హాంజీ కార్యక్రమంలో తన అభిప్రాయం పంచుకున్నాడు.
కాగా ఈ మెగా టోర్నీలో భారత్- పాక్ మధ్య అక్టోబరు 15న మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా నవరాత్రుల నేపథ్యంలో తేదీ మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వసీం అక్రం దగ్గర ప్రస్తావించగా.. ‘‘మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ అన్న అంశంలో ఆందోళన చెందాల్సిన పనేలేదు’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment