బుమ్రా కంటే వేగంగా సాధించాడు.. | Chahal Equals Bumrahs Record Of Most T20Is Wickets For India | Sakshi
Sakshi News home page

బుమ్రా కంటే వేగంగా సాధించాడు..

Published Sun, Dec 6 2020 6:54 PM | Last Updated on Sun, Dec 6 2020 6:57 PM

Chahal Equals Bumrahs Record Of Most T20Is Wickets For India - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్సిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ వికెట్‌ తీశాడు. తొలి టీ20లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చహల్‌ మూడు వికెట్లతో రాణించాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ను చహల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఔట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. 18 ఓవర్‌ ఐదో బంతికి స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు చహల్‌. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 59వ వికెట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఈ ఫీట్‌ను బుమ్రా కంటే వేగంగా చహల్‌ సాధించడం విశేషం. బుమ్రా ఇప్పటివరకూ 49 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు సాధించగా, చహల్‌ 44 మ్యాచ్‌ల్లో 59 వికెట్లను సాధించాడు. దాంతో బుమ్రా కంటే వేగంగానే చహల్‌ 59వ అంతర్జాతీయ టీ20 వికెట్‌ మార్కును చేరాడు. (టీమిండియా ‘టాప్‌’ రికార్డు)

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) లు రాణించి జట్టును గెలిపించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌  మాథ్యూ వేడ్‌ హాఫ్‌ సెంచరీకి తోడూ స్మిత్‌ కూడా రాణించడంతో ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. (హార్దిక్‌ బాదుడు.. టీమిండియాదే సిరీస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement