టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్‌కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.
ఆసీస్‌లో అరంగేట్రం
ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి
కానీ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.
‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు
‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్‌గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్‌లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.
అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.
బుమ్రాకు వెన్నునొప్పి
కాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.
అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్‌నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.
టీ20 సిరీస్ మనదే
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.
చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment