ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ గతేడాది ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
అరేంగేట్ర మ్యాచ్‌లోనే
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్‌స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటి
అనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్‌లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్‌కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.
వెన్నునొప్పి వేధిస్తోంది
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.
కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం.
మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్
టీ20లు
తొలి టీ20- జనవరి 22- కోల్‌కతా
రెండో టీ20- జనవరి 25- చెన్నై
మూడో టీ20- జనవరి 28- రాజ్‌కోట్
నాలుగో టీ20- జనవరి 31- పుణె
ఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబై
వన్డేలు
తొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్‌పూర్
రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్
మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.
చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment