షార్జా: యూఏఈ గడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ గర్జిస్తోంది. ఇక్కడ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందడంతో ధోని సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో బెంగళూరుపై నెగ్గింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ కోహ్లి (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ బ్రావో (3/24) బెంగళూరును దెబ్బతీశాడు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఓపెనింగ్ సూపర్‌హిట్
గత మ్యాచ్‌లో బెంగళూరు అంతకలిపి వందలోపే ఆలౌటైంది. కానీ ఈ మ్యాచ్‌లో వంద పరుగుల్లోపు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్ కసిదీరా ఆడారు. అదును చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. అదుపు తప్పిన బంతిని సిక్సర్‌గా బాదారు. దీపక్ చహర్ తొలి ఓవర్లో మొదటి రెండు బంతుల్ని కోహ్లి ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో మూడో ఫోర్‌ను పడిక్కల్ బాదాడు. బౌలర్ మారితే వీరి బ్యాటింగ్ జోరూ మారింది. హేజల్‌వుడ్ బౌలింగ్‌లో పడిక్కల్, శార్దుల్ ఓవర్లో కోహ్లి సిక్స్‌లు కొట్టారు. పవర్ ప్లేలో 55/0 స్కోరు చేసిన బెంగళూరు 11.1 ఓవర్లోనే వందకు చేరింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో బ్రావో... కోహ్లిని ఔట్ చేసి ఈ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇక్కడి నుంచి బెంగళూరు ఆట గతి తప్పింది. 17వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో డివిలియర్స్ (12)ను, పడిక్కల్‌ను పెవిలియన్ చేర్చాడు.
లక్ష్యఛేదనకు దీటుగా...
చెన్నై ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ (26 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) లక్ష్యఛేదనకు దీటుగా పరుగులు పేర్చుకుంటూ పోయారు. హసరంగ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ 4, 6తో వేగం పెంచాడు. సైనీ ఆరో ఓవర్లో డు ప్లెసిస్ ఒక సిక్స్, రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో సగటున ఓవర్‌కు 8 పరుగుల రన్‌రేట్‌తో సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ సాగిపోయింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రుతురాజ్‌ను ఔట్ చేసిన చహల్... ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. కాసేపటికే మ్యాక్స్‌వెల్... డు ప్లెసిస్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో రాయుడు, మొయిన్ అలీ (18 బంతుల్లో 23; 2 సిక్స్‌లు)తో కలిసి బాధ్యతను పంచుకోవడంతో చెన్నై లక్ష్యం చేరేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ ఇద్దరూ ఔటయినా... మిగిలిన లాంఛనాన్ని ధోని (11 నాటౌట్; 2 ఫోర్లు) రైనా (17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశారు.
ఐపీఎల్‌లో సింగపూర్ క్రికెటర్...
టి20 స్పెషలిస్టు, హార్డ్ హిట్ట ర్‌గా పేరొందిన సింగపూర్ బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు. జేమీసన్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జడేజా (బి) బ్రావో 53; పడిక్కల్ (సి) రాయుడు (బి) శార్దుల్ 70; డివిలియర్స్ (సి) రైనా (బి) ఠాకూర్ 12; మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) బ్రావో 11; డేవిడ్ (సి) రైనా (బి) చహర్ 1; హర్షల్ (సి) రైనా (బి) బ్రావో 3; హసరంగ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–111, 2–140, 3–140, 4–150, 5–154, 6–156.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–35–1, హేజల్‌వుడ్ 4–0–34–0, శార్దుల్ ఠాకూర్ 4–0–29–2, రవీంద్ర జడేజా 4–0–31–0, డ్వేన్ బ్రావో 4–0–24–3.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) కోహ్లి (బి) చహల్ 38; డు ప్లెసిస్ (సి) సైనీ (బి) మ్యాక్స్‌వెల్ 31; మొయిన్ అలీ (సి) కోహ్లి (బి) హర్షల్ 23; రాయుడు (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 32; రైనా (నాటౌట్) 17; ధోని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–71, 2–71, 3–118, 4–133. బౌలింగ్: సిరాజ్ 3–0–23–0, సైనీ 2–0–25–0, హసరంగ 4–0–40–0, హర్షల్ పటేల్ 3.1–0–25–2, చహల్ 4–0–26–1, మ్యాక్స్‌వెల్ 2–0–17–1.
ఐపీఎల్‌లో నేడు
డ్వేన్ బ్రావో
CSK Vs RCB చెన్నై టాప్‌గేర్
Published Sat, Sep 25 2021 5:08 AM | Last Updated on Sat, Sep 25 2021 7:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment