సౌతాంప్టన్‌లో 132 నాటౌట్, అడిలైడ్‌లో 123, మెల్‌బోర్న్‌లో 106, జొహన్నెస్‌బర్గ్‌లో 153, సిడ్నీలో 193, కొలంబోలో 145 నాటౌట్, హైదరాబాద్‌లో 204, బెంగళూరులో 92... ఒకటా, రెండా ఎన్ని అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలు... వాటిలో కొన్ని భారత్ విజయాలకు బాటలు వేశాయి... మరికొన్ని ఓటమి ఖాయమనుకున్న దశలో ఆపద్భాంధవుడిగా నిలిచి ఆదుకున్న ఇన్నింగ్స్‌లూ ఉన్నాయి... తనకే సాధ్యమైన శైలితో ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్‌పై చతేశ్వర్ పుజారా తనదైన ముద్ర వేశాడు.
పుష్కరకాలంగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన ఈ రాజ్‌కోట్ ప్లేయర్ ఇప్పుడు అరుదైన 100వ టెస్టు మైలురాయిని చేరుకుంటున్నాడు. రేపటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే టెస్టు పుజారాకు వందోది కానుంది. ఈ ఘనత సాధించిన 13వ భారత ఆటగాడిగా అతను నిలుస్తాడు.
–సాక్షి క్రీడా విభాగం
అక్టోబర్ 9, 2010, బెంగళూరు... భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు... మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు భారత స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా చతేశ్వర్ పుజారా వద్దకు వచ్చాడు. ‘నా వెన్నునొప్పి తగ్గలేదు, ఈ మ్యాచ్ ఆడలేనేమో’ అని పుజారాతో చెప్పాడు. దాంతో పుజారాకు అర్థమైపోయింది ఈ మ్యాచ్‌తో తాను టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నానని.
సరిగ్గా ఐదేళ్ల క్రితం అదే తేదీన తాను ఎంతగానో ప్రేమించే, తన కెరీర్ గురించి కలలుగన్న తల్లి చనిపోయిన రోజది! ఒకవైపు ఆనందం, మరోవైపు అమ్మను గుర్తు చేసుకుంటూ మ్యాచ్ బరిలోకి దిగిన పుజారా తొలి ఇన్నింగ్స్ 3 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్‌ను కాదని పుజారాను ధోని మూడో స్థానంలో పంపడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
అయితే కీలక అర్ధసెంచరీతో అతను రాబోయే రోజుల గురించి సంకేతాలిచ్చాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మరో మ్యాచ్‌లో చేసిన 159 పరుగులతో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తూ ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న పుజారా ప్రస్థానం పలు చిరస్మరణీయ విజయాల మీదుగా ఇప్పుడు వందో టెస్టు వరకు నిరి్వఘ్నంగా సాగింది.
అదే అతడి బలం...
పుజారా బ్యాటింగ్ శైలిని చూస్తే సహజంగానే పాతకాలపు క్రికెట్ గుర్తుకొస్తుంది. అసలైన సంప్రదాయ టెస్టును బతికిస్తున్న కొద్ది మందిలో కచి్చతంగా పుజారా పేరు ఉంటుంది. అద్భుతమైన టెక్నిక్ లేకపోయినా తన అసమాన పట్టుదల, ఏకాగ్రతతోనే అతను ప్రపంచ క్రికెట్‌లో తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు.
దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో గంటలపాటు క్రీజ్‌లో నిలిచిపోయి బౌలర్ల సహనం పరీక్షించడం, వారు అలసిపోయేలా చేసి ఆపై పరుగులు రాబట్టడం అతని శైలి. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా సుదీర్ఘ సమయం పాటు ఆడే మ్యాచ్ ఫిట్‌నెస్ ఉంటే చాలు అనే నమ్మే పుజారా తన బలాన్ని నమ్ముకొనే భారత క్రికెట్‌లో ఇన్నేళ్లు కొనసాగాడు.
‘నా బ్యాటింగ్ శైలి గురించి చర్చ, విమర్శలు అనవసరం. టెస్టుల్లో పరిస్థితిని బట్టి పరుగులు చేయడం ముఖ్యం. ఎలా చేశామన్నది కాదు’ అని దీనిపై అతను స్పష్టతనిచ్చాడు. ఈ క్రమంలోనే టీమిండియా గొప్ప విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు. బ్యాటర్లకు నరకంలా మారిన జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై ఒక టెస్టు లో 54వ బంతికి తొలి పరుగు తీయడం కూడా అలాంటిదే.
ఒకప్పుడు సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన తండ్రి అరవింద్ పుజారానే చతేశ్వర్‌కు తొలి గురువు కాగా, ఆయన పర్యవేక్షణలోనే అతను రాటుదేలాడు. అండర్–14 స్థాయిలోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఆపై అండర్ –19 స్థాయి వరకు వేగంగా పుజారా దూసుకుపోయాడు. రంజీ ట్రోఫీలో నాలుగు సీజన్ల పాటు 50 సగటుతో పరుగులు చేయడంతో 22 ఏళ్ల వయసులో భారత జట్టులో అవకాశం దక్కింది.
ఆసీస్ గడ్డపై అద్భుతాలు...
సుదీర్ఘ కెరీర్‌లో ఎన్ని విజయాలు ఉన్నా ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని ప్రత్యేక క్షణాలు కచి్చతంగా ఉంటాయి. అవి వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా జట్టు కోసం సాధించిన ఘనతలు కావచ్చు. అలాంటి ప్రదర్శనలే ఆ ప్లేయర్‌ను అందరూ గుర్తుంచుకునేలా శిఖరాన నిలబెడతాయి. అత్యంత బలమైన ఆ్రస్టేలియా జట్టును వారి సొంతగడ్డపైనే వరుసగా రెండు సిరీస్‌లలో ఓడించడం భారత్‌కు సంబంధించి అసాధారణ ఘనత. ఈ రెండు సందర్భాల్లోనూ పుజారా పాత్ర ప్రత్యేకం. 2018–19 సిరీస్‌లో 3 సెంచరీలు సహా ఏకంగా 521 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
2020–21 సిరీస్‌లో కూడా పుజారా మళ్లీ కీలకంగా మారాడు. ముఖ్యంగా చారిత్రాత్మక బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 211 బంతుల్లో చేసిన 56 పరుగులు జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఆసీస్ పేసర్ల దెబ్బలను ఓర్చుకుంటూ (9 సార్లు బంతి అతని శరీరాన్ని బలంగా తాకింది) చివరి రోజు అసమాన పోరాటం ప్రదర్శించడం విశేషం. సీనియర్ల గైర్హాజరులో 5 వన్డేలు ఆడే అవకాశం దక్కినా ఆ ఫార్మాట్ తనది కాదనే విషయం పుజారాకు బాగా తెలుసు. అయితేనేం, భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించి పుజారా ఒక అమూల్య వజ్రం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
చదవండి: భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2
Comments
Please login to add a commentAdd a comment