మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ వికెట్ కీపర్ లేక టీమిండియా గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కారు ప్రమాదం కారణంగా రిషబ్ పంత్, ఐపీఎల్-2023లో గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గత్యంతరం లేక ఫార్మాట్‌కు ఒకరి చొప్పున మూడు ఫార్మాట్లకు ముగ్గురు వికెట్‌కీపర్లతో నెట్టుకొస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా కనీస ప్రదర్శనలు చేయలేక, బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ దారుణంగా విఫలమవుతున్నారు. టెస్ట్‌ల్లో కేఎస్ భరత్, టీ20ల్లో ఇషాన్ కిషన్‌లకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తమను తాము నిరూపించుకోలే జట్టుకు భారంగా మారారు.
వన్డేల్లో సంజూ శాంసన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నా, అతని స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ముగ్గురితో విండీస్ పర్యటన వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన టీమిండియాకు, తాజాగా ఓ శుభవార్త వినిపించింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తుంది. అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్ చేసేందుకు కూడా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడని ఎన్‌సీఏ వర్గాల సమాచారం. రాహుల్ త్వరలో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి, ఎన్‌సీఏ నుంచి క్లియెరెన్స్ సర్టిఫికెట్ పొందుతాడని, తద్వారా అతను ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటాడని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ వెల్లడించింది.
ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. రాహుల్ త్వరలో బెంగళూరులో ఒకటి లేదా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాడని, ఇందులో అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడని సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితే అతను త్వరలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. రాహుల్ రాకతో టీమిండియా వికెట్‌కీపింగ్ కష్టాలు తీరతాయి.
ఇప్పట్లో భారత్ టెస్ట్‌లు ఆడేది లేదు కాబట్టి, పంత్ వచ్చే వరకు రాహులే టీమిండియా ఆల్ ఫార్మాట్ వికెట్‌కీపర్‌గా కొనసాగే అవకాశం ఉంది. రాహుల్ రాక ఇప్పటివరకు కాలం వెల్లబుచ్చిన ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌ల మెడపై కత్తి వేలాడదీస్తుంది. ప్రస్తుతం విండీస్ పర్యటనలో భారత జట్టుతో పాటు ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా రాహుల్‌ను త్వరగా జట్టులో చేర్చుకునేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment