అక్షర్ పటేల్, వాంఖెడే స్టేడియం (ఫైల్)
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్‌ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్‌కు తాకింది.
ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్‌తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది.
ఐసోలేషన్‌లో అక్షర్...
ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్‌లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది.
ఈ సీజన్‌లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్‌లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్‌టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో... 15న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు.
పది మంది సిబ్బందికి...
మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది.
‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment