CPL 2022: డుప్లెసిస్‌ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్‌లో నాలుగోది! కానీ పాపం.. | CPL 2022 GAW Vs SLK: Du Plessis Century Goes Vain GAW Won By 6 Wickets | Sakshi
Sakshi News home page

CPL 2022: డుప్లెసిస్‌ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్‌లో నాలుగోది! కానీ పాపం..

Published Fri, Sep 23 2022 12:51 PM | Last Updated on Fri, Sep 23 2022 1:55 PM

CPL 2022 GAW Vs SLK: Du Plessis Century Goes Vain GAW Won By 6 Wickets - Sakshi

సెంచరీ వీరుడు ఫాఫ్‌ డుప్లెసిస్‌(PC: Saint Lucia Kings/CPL T20)

Caribbean Premier League 2022 - Faf Du Plessis 4th T20 Century: కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2022లో భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌తో మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 103 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్‌లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు. 

అయితే, గయానా అమెజాన్‌ వారియర్స్‌ బ్యాటర్లు రాణించడంతో.. భారీ స్కోరు చేసినా సెయింట్‌ లూసియా కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఫాఫ్‌ డుప్లెసిస్‌ సెంచరీ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది. 

టాస్‌ గెలిచి.. భారీ స్కోరు చేసి
Guyana Amazon Warriors vs Saint Lucia Kings: గయానాలోని ప్రొవిడెన్స్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కింగ్స్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అయితే, మిగతా ఆటగాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ డిక్‌విల్లా(36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కింగ్స్‌ జట్టు 194 పరుగులు చేసింది.

అర్ధ శతకాలతో మెరిసి.. సమిష్టి కృషితో..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్‌ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌(26 బంతుల్లో 52 పరగులు), చంద్రపాల్‌ హేమ్‌రాజ్‌ (29 పరుగులు) శుభారంభం అందించారు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌ 30 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా షకీబ్‌ అల్‌ హసన్‌ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, ఆఖర్లో వారియర్స్‌ కెప్టెన్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ 36 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. 

ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఒక పరుగు తీసి రొమారియో షెఫర్డ్‌ లాంఛనం పూర్తి చేశాడు. ఇలా 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పోయి వారియర్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక విలువైన ఇన్నింగ్స్‌ ఆడిన షాయీ హోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్‌ డుప్లెసిస్‌.. 16 ఇన్నింగ్స్‌లో 468 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 96. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement